కలం, వెబ్ డెస్క్: ఒకటి కాదు, రెండు కాదు.. నెల రోజులు కావొస్తుంది.. కాకినాడ జిల్లా చిక్కుళ్ల అగ్రహారం గ్రామం నుంచి తప్పిపోయిన చిన్నారి జాహ్నవి (Jahnavi) జాడ మాత్రం దొరకడం లేదు. వందల మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ప్రతి చోటా గాలిస్తున్నారు.. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.. జాహ్నవి వెళ్లిన మార్గంలో ఉన్నవారిని విచారిస్తున్నారు.
కానీ, ఫలితం లేదు. తుని పరిసర గ్రామాల్లో గోడ పోస్టర్లు అంటిస్తున్నారు. సమాచారం అందించినవారికి రూ.లక్ష నగదు బహుమతి కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. తమ బిడ్డ ఎక్కడుందో.. ఎలా ఉందో.. తెలియక తల్లిదండ్రులు క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
చిన్నారి జాహ్నవి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. జూన్ 6వ తేదీన పాప మధ్యాహ్నం సమీపంలోని అడవి వైపు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెతో పాటు వెళ్లిన కుక్క తిరిగి వచ్చింది. కొద్ది రోజులకు కుక్క కూడా మరణించడంతో అనుమానాలు పెరిగాయి. అయితే, నీరసించిపోవడం వలనే అది చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో మరింత సందిగ్ధం నెలకొంది.
కిడ్నాప్ కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ రోజు అటు వైపుగా ఎవరైనా అనుమానిత వ్యక్తులు వెళ్లారా.. అని ఆరా తీస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

