కలం, వెబ్ డెస్క్: ఫాతిమా కాలేజీ వివాదంపై స్పందిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీ కూల్చివేస్తామని తమను బెదిరిస్తున్నారని.. ఇలాంటివి గతంలోనూ చాలా చూశామన్నారు. తమ విద్యాసంస్థలను ఎలా కాపాడుకోవాలని బాగా తెలుసని స్పష్టం చేశారు. ఒక్కటి కూలిస్తే, వంద కాలేజీలను కడుతామని హెచ్చరించారు. ఎవరి బెదిరింపులకు లొంగబోమని, విద్యార్థులను ఎలా చదివించుకోవాలో తమకు తెలుసన్నారు.
అసలేంటీ వివాదం..
హైదరాబాద్‌లోని బండ్లగూడ పరిధిలో ఉన్న సల్కం చెరువు శిఖం భూమిలోనే ఒవైసీ కుటుంబం ఫాతిమా కాలేజీ కట్టిందనేది ప్రధాన అభియోగం. కాలేజీలో కొంత భాగం చెరువు శిఖం, ప్రభుత్వ భూమిగా హైడ్రా గతంలోనే తేల్చింది. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని ఎలాంటి కూల్చివేత చర్యలు చేపట్టలేదు. అయితే, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ అనుమతులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాలేజీకి ప్రభుత్వ అనుమతులు లేవని పాఠశాల విద్యా శాఖ వివరించింది.
కాలేజీ భవనాలకైనా జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయా.. అని జడ్జి ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

