కలం, వెబ్ డెస్క్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. చదువుకుంటూనే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ కల్పించనుంది. రేపటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తోంది. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఇంటర్ పాసైన వారు కూడా ఈ మేళాకు హాజరు కావొచ్చు.
ఏయే కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్..
పారామెడికల్, నాన్ పారామెడికల్ విభాగాల్లో కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం, మేళాకు వచ్చినవారిని రెండు భాగాలుగా విడదీస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పారామెడికల్ కంపెనీల్లో పనిచేయాలనుకునేవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం తరువాత నాన్-పారామెడికల్ విభాగంలో అప్లై చేసుకున్నవారికి ముఖాముఖి నిర్వహిస్తారు. సెలెక్ట్ అయినవారికి వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు. అప్రెంటిస్‌గా చేరినవారికి నెలకు రూ.9,600 అందిస్తారు.
5 జిల్లాల్లో నిర్వహణ..
రేపటి నుంచి అయిదు జిల్లాల్లో అప్రెంటిస్ షిప్ కమ్ జాబ్‌మేళా నిర్వహిస్తారు. జులై ఆరో తేదీన మేడ్చల్ జిల్లాలోని ఎస్‌కేపీఎం ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కాలేజీ, 7వ తేదీన మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ, 13వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, 14వ తేదీన నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తారు.
ఏమేం తీసుకెళ్లాలి..
మేళాకు హాజరయ్యే వారు ఇంటర్ వరకు విద్యార్హతలున్న సర్టిఫికేట్ల జిరాక్స్‌లు రెండు సెట్లు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఉండాలి. మొదట వెరిఫికేషన్ జరిగాకే.. ఆసక్తి ఉన్న విభాగాల వద్దకు పంపిస్తారు. సరైన ధ్రువపత్రాలు లేనివారిని ఇంటర్వ్యూలకు అనుమతించబోరు.

