Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రకాళి సాక్షిగా ‘కుడా’ రగడ.. వరంగల్‌లో హైడ్రామా!

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) కుడా భూముల వేలం (KUDA land auction) మూడు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోరుకు దారితీసింది. కుడా భూముల వేలంలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి భద్రకాళి అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయడం, దానికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ నేత, ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కూడా తడిబట్టలతో అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. మరోవైపు ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చి పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ బీజేపీ ఆలయ శుద్ధికి దిగింది. పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది.

వివాదానికి తెరలేపిన బీఆర్ఎస్

ఇటీవల హనుమకొండలోని బాలసముద్రంలోని సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి కుడా వేలం వేసింది. గజానికి ధర రూ.50 వేలుగా నిర్ణయించగా రూ.95 వేల వరకు ధర పలికింది. ఇందులో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి తడిబట్టలతో వెళ్లి ప్రమాణం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోగా రాజకీయ చర్చకు దారితీసింది.

కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్

మాజీ చైర్మన్ చర్యను కాంగ్రెస్ నేత, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన భద్రకాళి ఆలయాన్ని రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చడం సరికాదని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. కుడా భూ వేలం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని స్పష్టం చేశారు.

అనంతరం ఆయన కూడా తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో భద్రకాళి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బీజేపీ ఎంట్రీతో మరింత హీట్

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదంలోకి బీజేపీ కూడా దిగింది. రెండు పార్టీలు కలిసి భద్రకాళి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చి ఆలయ పవిత్రతకు భంగం కలిగించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆలయం రాజకీయంగా అపవిత్రమైందని పేర్కొంటూ శనివారం ఆలయ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉదయం బీజేపీ నేతలు, కార్యకర్తలు భద్రకాళి ఆలయానికి చేరుకుని పసుపు నీళ్లతో ఆలయ శుద్ధికి ప్రయత్నించారు.

శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని మట్టేవాడ పీఎస్ కు తరలించారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మొత్తంగా కుడా భూముల వేలం వివాదం వరంగల్ రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోరుకు దారితీసింది. బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ ప్రతివాదనలు, బీజేపీ ఆలయ శుద్ధి, పోలీసుల అరెస్టులతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>