కలం, వెబ్ డెస్క్ : చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 1వ తేదీన విశాఖ (Visakhapatnam) తీరం నుంచి వీరంతా బోటులో వేటకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గల్లంతైన వారిని అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యగా గుర్తించారు. వీరిలో ఆరుగురు భోగాపురం ముక్కాం ప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలికి చెందినవాసిగా సమాచారం. మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నేవీ, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అత్యాధునిక బోట్లు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

