కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం “సర్” (SIR) పేరుతో హిందువుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఈ ప్రక్రియలో అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని, దీంతో క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తిస్థాయిలో జరగడం లేదని అన్నారు. తెలంగాణలో హిందువులు (Hindu Voters) అప్రమత్తంగా ఉండాలని, లేదంటే భవిష్యత్తులో హిందువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. శనివారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాచారం, దమ్మన్నపేట, దేశాయ్‌పేట, మన్నెగూడెం, గంబీర్‌పూర్, పోసానిపేట, దూంపేట గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రెయిన్‌లు, బస్టాండ్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
రూ.22 వేల కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చాం
దేశాయ్‌పేటలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొచ్చామని తెలిపారు. అందులో రోడ్ల నిర్మాణానికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. మోదీ, నితిన్ గడ్కరీ సహకారంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్, జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ రహదారుల విస్తరణకు భారీ నిధులు సాధించామని పేర్కొన్నారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పనులు దసరా నాటికి పూర్తవుతాయని, ఎల్కతుర్తి–సిద్దిపేట హైవే పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల తర్వాత తన లక్ష్యం పూర్తిగా అభివృద్ధేనని బండి సంజయ్ అన్నారు. గ్రామగ్రామాన రోడ్లు నిర్మించి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ భేదాలు లేకుండా ప్రజాప్రతినిధులంతా కలిసి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రూ.1.77 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి వెల్లడించిన లెక్కలను ప్రస్తావిస్తూ, రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇంత అప్పు చేసినా రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇస్తే వాటిని జీతాల చెల్లింపులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
వీబీజీ రామ్‌జీ పథకంపై స్పందన
జాతీయ ఉపాధి హామీ పథకానికి “వీబీజీ రామ్‌జీ” పేరు పెట్టి పనిదినాలు పెంచి గ్రామాలలో ఆస్తుల సృష్టి చేయడం తప్పేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ పథకంపై కోర్టుకు వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంచి పేరు వస్తే కొందరు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నాయకులను సమాజం గౌరవిస్తుందని పేర్కొంటూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు.

