కలం, వెబ్‌డెస్క్: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మంత్రులు ఉత్తమ్, భట్టి రూ.7వేల కోట్లు పంచుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. 20శాతం కమిషన్లు ఇచ్చిన వారికే బిల్లులు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. మా అధినేత కేసీఆర్ గారి ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.
అందుకే సీఎం, అరడజను మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారు. నా 25 ఏళ్ల జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్‌చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం చూడలేదు. అదీ కేసీఆర్ పవర్. 4వేల మందికిపైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడంతో రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి భయం పట్టుకుంది. అందుకే కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేషన్ ద్వారా పంచాలని చూస్తున్నారు. సీఎంకు దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టాలి.
45 టీఎంసీలు చాలనడం చారిత్రక తప్పిదం:
కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల్లో(Krishna Water) నీటి వాడకం కేవలం 28.49శాతం మాత్రమే. దీనికితోడు తెలంగాణకు 45 టీఎంసీలు చాలు అని కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) రాయడం చారిత్రక తప్పిదం. దీనిపై క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నాం. కానీ, వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్‌కు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీలో సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే మాకు తక్కువ సమయం ఇస్తున్నారు. మా గొంతు నొక్కుతున్నారు. మైకులు కట్ చేస్తున్నారు. అవకాశం ఇస్తే శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారం బయటపెడతాం.
అప్పుల కోసమే జీహెచ్ఎంసీ ముక్కలు:
సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటే భయం పట్టుకుంది. వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోలేదు. అందుకే కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితమయ్యారు. ఓయూకు ఒంటరిగా వస్తానని బీరాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనం. గ్లోబల్ సమ్మిట్‌లు, ఫుట్‌బాల్ షోకులు, అందాల పోటీలు పేదవాడికి అన్నం పెడతాయా? ఇది ప్రభుత్వం కాదు.. కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోంది. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ.180 కోట్ల కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీ(GHMC)ని మూడు ముక్కలు చేసి రూ.30వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారు అని హరీశ్‌రావు (Harish Rao )అన్నారు.
Read Also: అతి చేస్తే తాట తీస్తా: అధికారులకు హరీశ్ రావు వార్నింగ్
Follow Us On: Instagram


