కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లాలో స్థిరమైన జీవనోపాధి, సురక్షిత వలసలు, సమాజ స్థైర్య నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఎఫ్ఏవో, ఐవోఎం, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, వాసన్ సంయుక్తంగా అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ-పార్ట్ నర్ ట్రస్ట్ ఫండ్ సంయుక్త కార్యక్రమ మూడవ జిల్లా స్థాయి కమిటీ (DLC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అభివృద్ధి భాగస్వాములు, కార్యక్రమ అమలును సంస్థల ప్రతినిధులు పాల్గొని, కోస్గి, గుండుమల్ మండలాల్లోని వలస కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు చేపడుతున్న జీవనోపాధి కార్యక్రమాలు, సురక్షిత వలస సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అనుసంధానంపై కార్యక్రమ పురోగతిని సమీక్షించారు.
సమావేశంలో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ (MRC), మొబైల్ మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ (MMRC) ప్రవాసి హెల్ప్‌లైన్ పనితీరును కూడా సమీక్షించారు. వలస కార్మికులు వారి కుటుంబాలకు సమాచారం, మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్, సహాయ సేవలు అందిస్తున్న ఈ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) ఆదేశించారు. ముఖ్యంగా కార్మిక కార్డులు, ఇతర సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ సంక్షేమ సేవలకు ఒకే వేదికగా మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమం కింద సాధించిన విజయాలు వలస కుటుంబాలకు చెందిన 40 మంది మహిళలకు సమూహాల వారీగా మేకల పెంపకానికి అవసరమైన షెడ్లు, ప్రతి బృందానికి 30 మేకలు, 2 మగ మేకలను అందజేసి జీవనోపాధి అవకాశాలను కల్పించినట్లూ సంస్థ ప్రతినిధులు వివరించారు.
స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నాం..
అలాగే కోస్గి, గుండుమల్ మండలాల్లో మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా పేపర్ ప్లేట్ తయారీ యూనిట్లు సహా మొత్తం ఏడు మహిళా ఆధ్వర్యంలోని సూక్ష్మ వ్యాపారాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం వలస, బలహీన వర్గాల కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాల కోసం ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. మొబైల్ మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్, ప్రవాసి హెల్ప్‌లైన్ ద్వారా సురక్షిత, క్రమబద్ధమైన చట్టబద్ధమైన వలసలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సమావేశంలో నారాయణపేటలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ (Skill Training Institute) ఏర్పాటు చేయడం, యువత ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం, మహిళల జీవనోపాధి అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు. కిచెన్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించడం, కోస్గి చంద్రవంచ, అప్పాయిపల్లిలో ఆర్.ఓ. తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అలాగే గ్రామీణ సమగ్రాభివృద్ధి కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై సమావేశంలో చర్చ జరిపారు.
అన్ని శాఖలు సహకరించాలి..
ఎంఎంపీటీఎఫ్ సంయుక్త కార్యక్రమం కింద సాధించిన పురోగతిని అభినందించిన జిల్లా కలెక్టర్.. ఎఫ్ఏవో, ఐవోఎం, ఎన్ డబ్ల్యు డబ్ల్యుటీ, వాసన్ భాగస్వాములు, జిల్లా శాఖల సమిష్టి కృషిని ఎంతో ప్రశంసించారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి, ఎక్కువ మంది వలస కుటుంబాలు స్థిరమైన జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, సురక్షిత వలస సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేలా అన్ని శాఖలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో నారాయణపేట స్థానిక ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్‌ను అభివృద్ధి చేయడం, భారీ స్థాయిలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించి, జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశం చివరగా మహిళలు, యువత సాధికారత, స్థిరమైన జీవనోపాధి, సురక్షిత, క్రమబద్ధమైన గౌరవప్రదమైన వలసలను ప్రోత్సహిస్తూ నారాయణపేట జిల్లాలో మరింత స్థైర్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని సంకల్పించారు. అనంతరం భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయ చంద్రమోహన్, ఎఫ్ ఏ వో నుంచి జగన్, ఐ వో ఎం రాష్ట్ర సమన్వయకర్త జలజ, సహాయ సమన్వయకర్త మార్ట్ ఆశీర్, కోస్గి, గుండుమల్ ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: రూ.32 లక్షల జాబ్‌ని వదులుకున్న యువతి.. ఎందుకో తెలుసా!
Follow Us On: Sharechat

