కలం, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు (Govt School Students) వెంటనే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, రెండు జతల యూనిఫాంలు అందించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ (SFI) కరీంనగర్ (Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంపెళ్ళి అరవింద్, జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు.
పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పూర్తిస్థాయిలో అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే అవసరమైన సామగ్రి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఎంఈవో (MEO) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పాఠశాలలలో సమస్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి సరిగా చేరడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి సంస్థలకు అప్పగించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గత విధానంలో ఉన్నట్లుగా మహిళా సంఘాల ద్వారా మధ్యాహ్న భోజనం నిర్వహించాలని, నిధులను పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పెరుగుతున్నప్పటికీ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ(SFI) నాయకులు విమర్శించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్, సన్నీ, రక్షక్, సాయి, ఉదయ్, మనోజ్, శ్రీశాంత్, అభినవ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

