కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి వరద కాలువను రివర్స్ పంపింగ్ ద్వారా నింపి ఆయకట్టు గ్రామాల రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.
ఈ సందర్బంగా ఇరిగేషన్ శాఖ ఈఈ లాల్ సింగ్‌తో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇటీవల దెబ్బతిన్న వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే, సబ్ కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం వల్ల పనులు నెమ్మదించినట్లు ఇరిగేషన్ ఈఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వేముల ప్రశాంత్ రెడ్డి.. తక్షణమే ఇరు వర్గాల కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఒకట్రెండు రోజుల్లో వివాదాన్ని పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను కూడా స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాబోయే వారం, పది రోజుల్లో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వరద కాల్వకు నీటిని తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వరద కాలువపై ఏర్పాటు చేసిన తూముల ద్వారా నియోజకవర్గంలోని కాలువ పరిధి గ్రామాల చెరువులు నింపడానికి, ఆయా గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించడానికి ఈ వరద కాల్వే ఏకైక ఆధారమని ఆయన గుర్తుచేశారు.
ఈ విషయమై ఉన్నతాధికారులకు తక్షణమే నివేదికలు పంపాలని, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈఈని కోరారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) లో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, అలాగే ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ లాల్ సింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఎస్సారెస్పీ నుంచి గానీ లేదా కింది నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గానీ వరద కాల్వను పూర్తిగా నింపి, ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

