కలం, నేషనల్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం (Dimagi Naxals Controversy) కొనసాగుతున్నది. ఈ వ్యాఖ్యలు విపక్ష నేతలను ఉద్దేశించి చేసినవి కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ‘దిమాగీ నక్సల్స్’ అనే పదానికి అర్థం ఏమిటో వివరిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘ప్రధాని మోదీ విపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అనలేదు. మావోయిజానికి మద్దతు ఇచ్చి భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు, వేర్పాటువాదులకు అండగా నిలిచేవారు, ఆర్టికల్ 370కి మద్దతిచ్చేవారు, ఈశాన్య భారతాన్ని దేశం నుంచి వేరు చేయాలని భావించేవారినే దిమాగీ నక్సల్స్ అన్నారు’ అంటూ రిజిజు వివరణ ఇచ్చారు.
మోదీ ఏమన్నారు?
ఆగస్టు 15న ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. సాయుధ నక్సలిజం అంతం దశకు చేరుకున్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘దిమాగీ నక్సల్స్’ ఉన్నారని అన్నారు. వారిని గుర్తించి ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ఎదురుదాడి
మోదీ వ్యాఖ్యలకు స్పందిస్తూ చిదంబరం ఎక్స్‌లో ఒక్క వాక్యంతో కౌంటర్ ఇచ్చారు. ‘నేను దిమాగీ నక్సల్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నా!’ అంటూ పోస్టు చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. గతంలో తన రాజకీయ ప్రత్యర్థులను ‘అర్బన్ నక్సల్స్’గా పిలిచిన మోదీ.. ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అంటున్నారని విమర్శించారు. ఇది ప్రధాని నైరాశ్యానికి నిదర్శనమని ఎక్స్‌లో పేర్కొన్నారు.
యువతను నక్సలైట్లుగా ముద్రించొద్దు
మరోవైపు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) కూడా మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన విద్యావంతులైన యువతను ‘నక్సల్స్’గా ఎలా ముద్రిస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. ఇది అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.

