కలం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ (Sanath Nagar TIMS) ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, భారీ ఐసీయూ సామర్థ్యం, ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాలు, ఆధునిక డయాగ్నస్టిక్ సేవలతో రూపుదిద్దుకున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. 1,082 పడకల సామర్థ్యంతో నిర్మించిన టిమ్స్ లో 300 ఐసీయూ బెడ్లు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆరు కీలక వైద్య విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేసిన ఈ ఆస్పత్రి.. ప్రభుత్వ వైద్యరంగంలో కీలక ముందడుగుగా నిలవనుంది.
22 ఎకరాల్లో నిర్మాణం
సనత్ నగర్‌లోని 22.6 ఎకరాల విస్తీర్ణంలో టిమ్స్ ను నిర్మించారు. మొత్తం 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో రూపొందించిన ఈ వైద్య సముదాయంలో 1,082 పడకలు ఉన్నాయి. వీటిలో 300 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించేలా మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్సల కోసం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ కోసం పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రత్యేక ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నాలుగు ప్రధాన బ్లాకులు
టిమ్స్ ను నాలుగు ప్రధాన బ్లాకులుగా విభజించి వైద్య, పరిపాలనా, విద్యా సేవలను ఒకే సముదాయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్లాక్-ఏ లో అత్యవసర వైద్య సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ పడకలు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. బ్లాక్-బీ లో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబొరేటరీలు, సాధారణ వార్డులు, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్-డీలో పరిపాలన, విద్యా విభాగాలతోపాటు సుమారు 200 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు.
నిమిషాల్లోనే రక్త నమూనాలు
సనత్ నగర్ టిమ్స్ లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ప్రత్యేకంగా నిలవనుంది. సీల్డ్ ట్యూబ్‌లను గాలి ఒత్తిడితో నడిపించే ఈ వ్యవస్థ ద్వారా రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వైద్య సామగ్రిని.. వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబొరేటరీలు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య వేగంగా తరలించవచ్చు. ఒక విభాగం నుంచి మరో విభాగానికి నమూనాలను తరలించేందుకు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించి.. కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత ల్యాబ్‌కు చేరేలా దీన్ని రూపొందించారు. దీంతో పరీక్షల ఫలితాలు వేగంగా అందడంతోపాటు నమూనాలు కలుషితం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
ఆరు విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
టిమ్స్ ను ఆరు కీలక వైద్య విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేశారు. అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ ఇందులో ఉన్నాయి. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలకు అవకాశం కల్పించారు. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో కూడిన క్లినికల్ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా 30 క్లినికల్ విభాగాలు పనిచేసేలా మౌలిక వసతులు సిద్ధం చేశారు.
అత్యాధునిక స్కానింగ్‌లు
రోగ నిర్ధారణకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. ఇందులో 3.0 టెస్లా ఎంఆర్ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, ఐదు ఎక్స్‌రే యంత్రాలు ఉన్నాయి. దీంతో క్లిష్టమైన వ్యాధులను వేగంగా గుర్తించడంతోపాటు ఖచ్చితమైన నిర్ధారణకు అవసరమైన పరీక్షలను ఒకే చోట నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.
జీ+5 అంతస్తుల ధర్మశాల
దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకుల కోసం కూడా సదుపాయాలు కల్పించారు. జీ+5 అంతస్తుల్లో నిర్మించిన ధర్మశాలలో సుమారు 200 మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, కేంద్ర వంటశాల, లాండ్రీ, వైద్య ఆక్సిజన్ పైప్‌లైన్ వంటి అనుబంధ సదుపాయాల కోసం ప్రత్యేక బ్లాకులను ఏర్పాటు చేశారు.
75 శాతం నీటి పొదుపు
టిమ్స్ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని తగ్గించే సాంకేతికతలను అమలు చేసి.. 75 శాతం వరకు నీటి పొదుపు సాధించేలా ప్రణాళిక రూపొందించారు. మురుగునీరు, వ్యర్థ ద్రవాల శుద్ధి కోసం ఎస్టీపీ, ఈటీపీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సేకరించి యార్డ్ వాటర్ సంప్ల ద్వారా మొక్కలు, గ్రీన్ కారిడార్ల నిర్వహణకు వినియోగించే విధానాన్ని అమలు చేయనున్నారు.

