కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మండల స్థాయి ప్రజావాణి ( Prajavani ) కార్యక్రమం ప్రారంభం కానుంది. అవసరాన్ని బట్టి ప్రజావాణి నిర్వహణకు రైతు వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రంలో అన్ని మండలాల ఎంపీడీవోలకు సూచించారు. రాష్ట్రంలోని పలు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో తగినంత స్థలం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చిన్నారెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో రైతు వేదికల్లో మండల ప్రజావాణి నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరగా, ఆయన వెంటనే సమ్మతించినట్లు వెల్లడించారు. స్థలాభావం ఉన్న మండలాల్లో ప్రజావాణి కోసం రైతు వేదికలను వినియోగించుకోవాలని, దరఖాస్తుదారులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇటీవల ప్రజా భవన్‌లో రాష్ట్రంలోని అన్ని మండలాల ఎంపీడీవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఇచ్చిన సూచనలను పాటించాలని చిన్నారెడ్డి ఆదేశించారు.

