కలం, వెబ్ డెస్క్: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏకే ఖాన్ (AK Khan) కుమారుడు మొహిసిన్ ఖాన్ (Mohsin Khan)పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్‌లోని ఐదు సెక్షన్ల కింద కేసు నమోదైంది. చీటింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు సినిమా తీయడానికి పెట్టుబడిదారులను (ఫైనాన్షియర్లు) పరిచయం చేస్తానని చెప్పి మొహిసిన్ ఖాన్ రూ..25 లక్షలు తీసుకున్నాడని, ఆ తర్వాత అతని స్నేహితుడు తబ్రేజ్ మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో మరో రూ. 25 లక్షలు తీసుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ ఒక్క ఫైనాన్షియర్‌ను కూడా పరిచయం చేయలేదని, తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని, అడిగిన ప్రతిసారీ సాకులు చెప్తూ దాటవేశారని పేర్కొన్నారు. దీనికి తోడు మమ్మల్నే డబ్బులు అడుగుతావా.. ఏం చేస్తావో చూద్దాం.. అంటూ తనను మొహిసిన్ ఖాన్ ఒక గదిలో బంధించి బెదిరించారని పేర్కొన్నారు. అక్కడున్న బౌన్సర్లు సైతం మారణాయుధాలను చూపించి బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఘర్షణ మొత్తాన్ని తబ్రేజ్ తన మొబైల్‌లో రికార్డు చేశారని తెలిపారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బీఎన్ఎస్ లోని 12(2), 115(2), 352, 351(2), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొహిసిన్ రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు మాత్రమే కాక కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ అల్లుడు కూడా.

