కలం, భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు నియామకాలపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి (Sunitha Mahender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా వ్యాపారవేత్తలను, ఆంధ్ర ప్రాంతం వాళ్లను యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించారని ఆమె ఆరోపించారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వదినను (కొణిదెల సురేఖ) ఈ ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమించడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆంధ్రా నాయకుల చేతుల్లో ఉన్నాడు అనడానికి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకమే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆలయ కమిటీల్లో ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లను సభ్యులుగా నియమించాలే తప్ప, ముఖ్యమంత్రి స్వలాభం కోసం వ్యాపారవేత్తలను కేటాయించడం సరికాదన్నారు. ఇందుకోసం పాత సంప్రదాయాలను పూర్తిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు. స్వామివారి ఆలయం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ఈ బోర్డులో సభ్యులుగా అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదాద్రి దేవస్థాన కమిటీ నియామకం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీస్తోంది.
Read Also: ఎంపీ ఇంట్లో సోదాలు.. బంగారు లోదుస్తులు, కోట్ల నగదు సీజ్
Follow Us On : WhatsApp

