కలం, హనుమకొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్లు కాలయాపన చేసిందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ (Dasyam Vinay Bhaskar) మండిపడ్డారు. హామీలు ఇవ్వడమే తప్ప.. అభివృద్ధి ఏదీ? అని నిలదీశారు. సోమవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌నే సీఎం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ఆపే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.
చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy) మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిట్టడం తప్ప పరకాలకు రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే వచ్చాయని అన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.

