కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండల కేంద్రంలో ఒక వింత పరిస్థితి చోటుచేసుకుంది. అందరికీ న్యాయం చెప్పాల్సిన కోర్టు భవనానికే తాళం పడింది. గత కొంతకాలంగా అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన భవన యజమాని ఏకంగా జ్యుడిషియల్ కోర్టు భవనానికే తాళం వేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండల కేంద్రంలో జ్యుడిషియల్ కోర్టు నిర్వహణ కోసం భవన యజమాని ముంజాల మధు తన భవనాన్ని అద్దెకు ఇచ్చారు. 2025 ఏప్రిల్ 19న ఈ కోర్టు ఘనంగా ప్రారంభమైంది. అయితే కోర్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క నెల అద్దె కూడా అధికారులు చెల్లించలేదని భవన యజమాని ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై జిల్లా కోర్టు అధికారులను తాను పలుమార్లు కలిసి అద్దె చెల్లించాలని కోరినట్లు యజమాని తెలిపారు. అయితే బిల్లుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే డబ్బులు చెల్లిస్తామని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే అద్దె చెల్లించకపోవడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయాలని కోరుతూ జిల్లా కోర్టుకు, హైకోర్టుకు కూడా లేఖలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో కూడా రెండుసార్లు అద్దె కోసం భవనానికి తాళం వేయగా.. జిల్లా కోర్టు అధికారుల హామీ ఇవ్వడంతో తిరిగి తెరిచినట్లు మధు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. విసుగు చెంది బుధవారం మరోసారి కోర్టు భవనానికి తాళం వేసినట్లు మధు ప్రకటించారు. ఇప్పటికైనా తనకు రావాల్సిన అద్దె బకాయిలతో పాటు, పేరుకుపోయిన విద్యుత్ బిల్లులను వెంటనే చెల్లించి, భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని అధికారులను యజమానులను డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?
Follow Us On : WhatsApp

