Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి కొత్తగూడెంలో రూ.4.74 కోట్ల గంజాయి నిర్వీర్యం

కలం, ఖమ్మం బ్యూరో : న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణంలో గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని 7 కేసులకు సంబంధించిన సుమారు మొత్తం 948.478 కిలోల గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని ఎం/ఎస్ ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రాంగణంలో నిప్పుపెట్టి పూర్తిగా బూడిద చేశారు.

ఈ నిర్వీర్యం చేసిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4 కోట్ల 74 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ దహన ప్రక్రియ అంతటా పర్యావరణానికి గానీ, ప్రజారోగ్యానికి గానీ ఎలాంటి హాని కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ గంజాయి నిర్వీర్య కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులైన కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ, భద్రాచలం సబ్ డివిజన్ డిఎస్పి అరుణ్ కుమార్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>