కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి (MCH), జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ముందుగా ఎంసీహెచ్‌లోని ఏఎన్‌సీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రతిరోజూ ఎంతమంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారనే విషయాన్ని రిజిస్టర్ల ద్వారా తెలుసుకున్నారు. గర్భిణుల ఆరోగ్య నివేదికలను పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
టిఫా స్కానింగ్ కేంద్రాన్ని సద్వినియోగపరచాలి
టిఫా (TIFFA) స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి, స్కానింగ్ సేవలను ఎంతమంది గర్భిణులు వినియోగిస్తున్నారో రికార్డులను పరిశీలించారు. పేద గర్భిణులకు ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి, వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు.
ముఖ్యంగా రక్తహీనత (అనీమియా)తో బాధపడుతున్న గర్భిణులను గుర్తించి, వారికి ప్రత్యేక చికిత్స, పోషకాహారం, ఐరన్ మందులు అందించి రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రక్తహీనత సమస్యను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అలాగే ఎంసీహెచ్‌లోని టిఫా స్కానింగ్ యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ప్రతిరోజూ కనీసం ఐదుగురు గర్భిణులకు స్కానింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
డయాలసిస్ రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డయాలసిస్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ (Collector Adarsh Surabhi), ప్రతిరోజూ చికిత్స పొందుతున్న రోగుల వివరాలను తెలుసుకుని వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. డయాలసిస్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు వార్డును గ్రౌండ్ ఫ్లోర్‌కు మార్చాలని కోరగా, క్రిటికల్ కేర్ యూనిట్‌లో మరో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అలాగే ప్రస్తుతం ఉన్న సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని, రోగుల అవసరాల కోసం అదనపు వీల్‌చైర్లు కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకుని, అవసరాలపై ప్రతిపాదనలు సమర్పించాలని, వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ శివప్రసాద్, ఇతర వైద్య అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Read Also: గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ
Follow Us On: X(Twitter)

