కలం డెస్క్ : కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టులన్నీ ఆంధ్ర ప్రాంతంవారికి కట్టబెట్టిన కేసీఆర్.. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ (Minister Uttam) ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలోకంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు నీళ్ళలో అన్యాయం డబల్ అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల(Krishna River Water) పంపకాల సమావేశంలో 299 టీఎంసీలు సరిపోతాయంటూ సంతకం మరణశాసనం రాశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన పదేండ్లలో పలు ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఏపీకి నీటి దోపిడీతో పాటు మౌలిక సౌకర్యాలు సమకూర్చుకునేందుకు కూడా కేసీఆర్ భరోసా ఆ రాష్ట్ర పాలకులకు శ్రీరామరక్షగా ఉపయోగపడిందని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కామెంట్ చేశారు.
నికర జలాలు పోతున్నా కేసీఆర్ మౌనం :
కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు దక్కిన నికర జలాలనూ ఏపీ దోచుకుపోతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉండి కూడా కేసీఆర్(KCR) మౌనంగా ఉండడమే కాక సహకారం అందించారని మంత్రి ఉత్తమ్(Minister Uttam) అన్నారు. అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌తో దోస్తానా చేసి అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుల్లాంటివి కట్టుకోడానికి స్నేహహస్తం అందించారని అన్నారు. దీంతో రోజూ 3 టీఎంసీల నీటిని దోచుకునేందుకు ఏపీ సర్కారుకు లైసెన్సు ఇచ్చినట్లయిందన్నారు. కృష్ణా జలాల్లో ‘ఒక్క సంవత్సరం మాత్రమే’ అని 299 టీఎంసీలకు ఒప్పుకున్న కేసీఆర్.. ఆ తర్వాత ‘ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు’ అంటూ దాన్ని ఒక శాశ్వత ఒప్పందంగా మార్చారని ఆరోపించారు. 2015 నుంచి వరుసగా ఐదేండ్ల పాటు ఈ సర్దుబాటుకు సంతకం చేశారని గుర్తుచేశారు.
ప్రాజెక్టులకు ఎడాపెడా అప్పులు :
కాళేశ్వరం సహా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ శాఖలో రూ. 96,108 కోట్లను ప్రత్యేక కార్పొరేషన్ పేరుతో వివిధ సంస్థల నుంచి అప్పుగా తీసుకున్నారని, 11% వడ్డీకి అగ్రిమెంట్ చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ అప్పులను, వాటిమీద వడ్డీని తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని, ఇప్పటికే రూ. 49 వేల కోట్లను తీర్చిందన్నారు. ఇంకా దాదాపు రూ. 56 వేల కోట్లు (వడ్డీతో కలిపి) అప్పులున్నాయన్నారు. రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ-ఇంజనీరింగ్ పేరుతో అక్కడి రైతులకు ద్రోహం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Project) కట్టడం, కూలిపోవడం.. ఆయన హయాంలోనే జరిగిపోయిందన్నారు.
ఆంధ్ర ఎత్తులకు రేవంత్ బ్రేకులు :
ఆంధ్ర పాలకుల ప్రలోభాలకు, రాజకీయాలకు అమ్ముడు పోయిన కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని, ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు రేవంత్(Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం చొరవ తీసుకున్నదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఆ పనులను అడ్డుకుంటున్నామన్నారు. హరీశ్‌రావు(Harish Rao) అతి తెలివి ప్రదర్శిస్తూ ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా చేసిన పానాన్ని, నిందను ఇప్పుడు కాంగ్రెస్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్లకు అలవాటు పడి కాళేశ్వరం అంచనాను అనేక రెట్లు పెంచారని, అతి తక్కువ కాలంలో కట్టామని చెప్పుకున్నా చివరకు దాని ద్వారా ఐదేండ్లలో ఎత్తిపోసిన నీరు 100 టీఎంసీలు కూడా లేదన్నారు. మొత్తం 165 టీఎంసీలను ఎత్తిపోస్తే అందులో 65 టీఎంసీల నీరు మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిందన్నారు.
Read Also: కృష్ణా జలాల్లో ద్రోహమెవరిది?
Follow Us On: Youtube


