కలం, వెబ్ డెస్క్ : రైతుల సమయాన్ని ఆదా చేయాలనే సదుద్దేశ్యంతోనే యూరియా సరఫరాకు యాప్ (Urea Online Booking App) తీసుకొస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswar Rao) చెప్పారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండే వారికి తాము చేసే మంచి పని కూడా మోసంలాగే కనిపిస్తుందని తుమ్మల మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునే వారికి.. యూరియా ఎవరిస్తారు.. ఎక్కడి నుండి వస్తుంది.. ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే వాళ్ళ స్వార్థరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో తెలుస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా అందుబాటులో ఉన్నప్పటికి, ప్రతిపక్ష నాయకులు రైతులను మరింత భయపెట్టే విధంగా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో వారి సమయాన్ని వృధా చేసుకోకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం యాప్ ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్(Kapas Kisan App) ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించామని, దీనిని కూడా విజయవంతంగా అమలుచేసి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచలు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ గురించి మాట్లాడకుండా ఉంటే, కనీసం వారికి ఉన్న కాస్తో, కూస్తో గౌరవం ఉంటుందని చెప్పారు. ఎన్నికల హామీకి కట్టుబడి 50 రోజుల్లోనే రూ. 2 లక్షల వరకు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం లోపే పూర్తి చేశామన్నారు. రుణ మాఫీ కోసమే రూ.20,600 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మొండి పట్టుదలతో.. ఆర్థికంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్నా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేసి చూపించారని తెలిపారు.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించి, వరి వేయకుండా చేశారని తుమ్మల విమర్శించారు. ఎన్ని విమర్శలు చేసినా.. రైతును రాజును చేయడమే ప్రభుత్వం, సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయరంగంలో సాంకేతికతను జోడించామని, భవిష్యత్తులో తెలంగాణ విజన్ 2047 కు అనుగుణంగా వ్యవసాయరంగాన్ని మార్చి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ ముందు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలలోనే పరిశీలిస్తున్నామన్నారు. కావాలంటే బిఆర్ఎస్ నాయకులు కూడా రైతుల ప్రయోజనాల కోసం మార్పులు సూచించవచ్చని మంత్రి తుమ్మల (Thummala Nageswar Rao) కోరారు.
Read Also: విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ ఖరారు
Follow Us On: X(Twitter)


