కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల పట్టణంలో చుక్కల మందుకు చక్కని స్పందన లభించింది. కేంద్రాల్లో ఉదయం పూట పేరెంట్స్ పిల్లలను ఒకేసారి పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకురాగా సందడి కనిపించింది. మరో రెండు రోజులు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయనున్నారు. జగిత్యాల పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం అంచనాలకు మించి సక్సెస్ అయింది. 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు 48 వార్డుల్లోనూ పోలియో డ్రాప్స్ వేశారు.
ఆదివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సంయుక్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్, కౌన్సిలర్లు రాగుల ప్రదీప్, మమత రామకృష్ణారెడ్డి, అరవ లక్ష్మి, చంద్రకళ, నవీన్, ప్రశాంత్ రావు, పిట్ట ధర్మరాజు, గంగాధర్, మనపూరి పవిత్ర మహేష్, మిగతా కౌన్సిలర్లు, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, వార్డ్ ఆఫీసర్లు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని వారి వారి కేంద్రాల్లో డ్రాప్స్ వేయించారు.
కొరత వచ్చినా ఆగలేదు..
మధ్యాహ్నానికి కొన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అయిపోయాయి. విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. సుజాత అప్రమత్తమయ్యారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డా. శ్రీనివాస్, జైపాల్ రెడ్డిలతో కలిసి యుద్ధప్రాతిపదికన సెంటర్లకు వ్యాక్సిన్ పంపించగా దీంతో సాయంత్రానికి టార్గెట్ పూర్తయింది.
అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ఏ ఎన్ఎం మాదేషి శిరీష,ఆశాలు లావణ్య, మంజుల,సంధ్య, పద్మలతో పాటు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉదయం 7 గంటల నుంచే ఫీల్డ్‌లోకి దిగి చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం కోసం శ్రమించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో “పోలియో రహిత జగిత్యాల” దిశగా మరో అడుగు పడిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. “రెండు చుక్కలు – జీవితాంతం భరోసా” అని ఛైర్‌పర్సన్ వాణి పిలుపునిచ్చారు.

