కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి రాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఉద్యోగుల మీదనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలుగా పనిచేస్తున్నవారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే అన్నారు. వారిపైనే ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ఎంఐఎంతో చేతులు కలిపాయని కిషన్ రెడ్డి విమర్శించారు. పాతబస్తీలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులకు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. అక్కడ ఉన్న మన దేశం వారికి ఓట్లు ఉండొద్దా.. అని ప్రశ్నించారు. సర్ ప్రక్రియను ఎందుకు అత్యంత పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోందన్నారు. పాతబస్తీ సహా దేశంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండొద్దన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే..
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని.. వాటితో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. హైదరాబాద్లో ఏ అధికారి పనిచేయాలో దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్ణయిస్తున్నారని ఆరోపించారు.

