Mobile Popup Ad
Mobile Popup Ad

వాన‌లోనూ ప్ర‌గ‌తి బాట‌.. అభివృద్ధి ప‌నుల‌కు పొంగులేటి శ్రీకారం

​కలం, ఖమ్మం బ్యూరో: వ‌ర్షం కురుస్తున్నా, వాతావరణం అనుకూలించకపోయినా లెక్క చేయకుండా.. గ్రామీణ ప్రాంతాల రవాణా కష్టాలకు శాశ్వత బ్రేక్ వేయడమే ధ్యేయంగా పాలేరు (Paleru) నియోజకవర్గంలో ప్రగతి బాట సాగింది. వానైనా.. వరదైనా ప్రజల కోసం ప్రగతి పనులు ఆపేది లేదని నిరూపిస్తూ కూసుమంచి మండలంలో శనివారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ, వర్షపు చినుకుల సాక్షిగానే దుబ్బతండా, లాల్ సింగ్ తండా, జీళ్ళచెరువు గ్రామాల్లో రూ. 16.13 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

​ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చిందంటే చాలు తండాలు, పల్లెల్లోని ప్రజలు బురద రోడ్లతో, ప్రవహించే వాగులతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వానాకాలం రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఈ పనులను అత్యంత త్వరితగతిన మంజూరు చేయించామని ఆయన స్పష్టం చేశారు. వాతావరణం ఎలా ఉన్నా ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తామని, అధికారులు కూడా అదే వేగంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

​ఈ పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి రూ.16.13 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దుబ్బతండా గ్రామంలో జడ్పీ రోడ్డు గైగోల్లపల్లి నుంచి దుబ్బతండా వరకు రూ. 2.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అలాగే జడ్పీ రోడ్డు నుండి కొత్తూరు – ఎర్రగడ్డ తండా మీదుగా దుబ్బతండా వరకు రూ. 4.50 కోట్లతో చేపట్టే మరో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లాల్ సింగ్ తండా నుంచి నేరేడువాయి వరకు రూ. 2.03 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టారు. ఆ తర్వాత జీళ్ళచెరువు గ్రామంలో జీళ్ళచెరువు మీదుగా కొండాపురం నుంచి మోటాపురం వెళ్ళే ప్రధాన రహదారిపై రూ. 7.50 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రెండు కీలక వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

​వర్షంలోనూ ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ విస్తృత పర్యటనలో మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వివిధ శాఖల జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>