కలం, కరీంనగర్ బ్యూరో: సమాజంలో నిరంతరం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నిలబడే కమ్యూనిస్టు పార్టీ(CPI)ని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) పిలుపునిచ్చారు. సమస్యల వారీగా పోరాటాలు నిర్వహించడానికి అందరూ సంఘటితం కావాలని అన్నారు. శనివారం కరీంనగర్ (Karimnagar) జిల్లా రామగుండం మండలం గుంటూరుపల్లిలో సీపీఐ గ్రామ శాఖ ఏర్పాటు చేసిన సీపీఐ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపన కోసం, వర్గ రహిత సమాజం కోసం, కార్మిక వర్గ ప్రయోజనాలే ముఖ్యమని సీపీఐ వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. రాష్ట్రంలో అనేక పార్టీలు పుట్టుకొచ్చాయని, కాలగర్భంలో కలిసి పోయాయని కానీ నేటికి సజీవంగా ఉన్న పార్టీ సీపీఐ అని అన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిస్టులు ఉంటారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 ఏళ్లు గడిచినా, పాలక ప్రభుత్వాలు మారినా ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతుందని, నిరుద్యోగం పెరిగిపోతుందని, అవినీతి, అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని, పెట్టుబడి దారుల చేతుల్లో దేశ సంపద చిక్కుకుంటుందని అందుకు పాలక ప్రభుత్వాలే ప్రధాన కారణమని శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పెరిగిపోయాయని, ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పడుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బ్రతుకులు మారుతాయని అనుకుంటే గత పాలకులలాగా ఈ పాలకులు కూడా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని, పేదల సంక్షేమం కోసం పనిచేయక పోతే రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ పోరాటాలు ఉదృతం చేయక తప్పదని శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నలువాల సదానందం, సీపీఐ గుంటూరు పల్లి శాఖ కార్యదర్శి సాయవేణి రాయమల్లు, సీనియర్ నాయకులు సామల్లా కొమురయ్య, చిందం మల్లయ్య, నాయకులు తంగెళ్ళ లక్ష్మయ్య, పిల్లి రమేష్, తాత సమ్మయ్య, తంగెళ్ళ సంపత్, సదయ్య, గొడుగు సంపత్, సాయవేణి రాజు తదితరులు పాల్గొన్నారు.

