కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతుంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాస్తుల కేసులో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Malla Reddy) ఏసీబీ (ACB) కి చిక్కడంతో ఇప్పుడు జిల్లాలో ఎక్సైజ్ ‘మామూళ్ల డైరీ’ కలకలం రేపుతుంది. ఆ డైరీలో ఇంకా ఎవరెవరి బాగోతం దాగి ఉందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా డైరీలోని అన్నట్లుగా కొన్ని పేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెక్ట్స్ ఎవరు ఏసీబీకి చిక్కుతారన్న చర్చ జరుగుతుంది.
కొద్దిరోజుల కింద కామారెడ్డి జిల్లా బిచ్కుంద సీఐ సత్యనారాయణ కల్లు దుకాణాల మార్పిడి కోసం రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఆ మధ్య నిజామాబాద్‌లో (Nizamabad) ఆదిలాబాద్, మహారాష్ట్ర గంజాయి బ్యాచ్‌లు ఎక్సైజ్ పోలీసులను కారుతో ఢీకొట్టాయి. ఆ ఘటనలో కానిస్టేబుల్ సౌమ్య చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అపుడు మహారాష్ట్ర గంజాయి బ్యాచ్‌లతో స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఫ్రెండ్‌షిప్ దందా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
రెండు రోజుల కింద నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి (ACB Raids) చేసింది. రూ. 3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించింది. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ. 20 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు ఎక్సైజ్ అధికారులు. ఇలా ఎక్సైజ్ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
కొత్త లంచం డైరీ బట్టబయలు
కల్లు దుకాణాలు, వైన్స్‌ల నుంచి నెల నెలా ఎంత రావాలి? పాత లంచం ఎంత, కొత్తది ఎంత?.. అనేది క్లియర్‌గా రాసి ఉన్న డైరీ పేజీలు బయటకు వచ్చాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఏసీబీకి పట్టుబడగానే ఈ డైరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు పేజీల్లో నెలకు చెందిన రెండు లక్షల లంచం వివరాలు ఆ పేజీలో ఉండటం చర్చనీయాంశమైంది. ఇటు ఎక్సైజ్ అటు పొలిటికల్ సర్కిల్స్ జనాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.. ఇక నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అనే చర్చ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతుంది.
Read Also: నల్లగొండకు సీఎం.. హామీలపై కోటి ఆశలు!
Follow Us On: Instagram

