Mobile Popup Ad
Mobile Popup Ad

అడవిలో పులి.. అటవీశాఖ చిచ్చు!

కలం, ఆదిలాబాద్ బ్యూరో: పులుల సంరక్షణ కోసం ఊళ్లను ఖాళీ చేసిన గిరిజనులు, భూములు కోల్పోయే ఆదివాసీల (Adivasi Groups) మధ్య వివాదం ముదిరింది. పునరావాస గ్రామాలకు తరలివచ్చిన గిరిజనులకు, భూములు కేటాయించే ప్రక్రియ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనికి అటవీ శాఖ అధికారుల తీరే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. నిర్మల్ (Nirmal) జిల్లా కడెం మండలంలో అటవీ ప్రాంతం (Forest Area)లోని రాంపూర్, మైసంపేట ప్రాంతాల గిరిజన కుటుంబాలు పులుల ఆవాస సంరక్షణ కోసం తమ గూడేలను వదిలిపెట్టాయి.

దీంతో నచ్చన్ ఎల్లాపూర్, ధర్మాజీపేట శివార్లలో 94 గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించింది. వారికి గృహాలు నిర్మించి ఇవ్వడంతో పాటు జీవనోపాధి కోసం భూములను కూడా కేటాయించింది. పట్టాలు సైతం అందించింది.

కేటాయించిన భూములపై అభ్యంతరం

మైసంపేట పునరావాస బాధితులకు కేటాయించిన భూములపై గోండుగూడ గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము అనేక ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామంటున్నారు. తమ అనుమతి లేకుండా మైసంపేట గిరిజనులకు కేటాయించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు.“ మా భూములు మాకే ఇవ్వాలి. లేకపోతే ఉద్యమానికి సిద్ధం”అని గోండుగూడ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అటవీ అధికారులు మైసంపేట గిరిజనులకు భూములను అప్పగించే ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం భూములను చదును చేసి, హద్దులు నిర్ణయించి, 94 మంది లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తి చేశారు.

ఈ ప్రక్రియను గోండుగూడ గిరిజనులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భూముల చదును వ్యతిరేకిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ మహిళలను అధికారులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఘటనలో కొందరు మహిళలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న అధికారులు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు.

చిచ్చు పెట్టొద్దంటున్న ఆదివాసీ సంఘాలు

అటవీ అధికారుల తీరును తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ తప్పుబట్టారు. పులి ఆవాసాల సంరక్షణకు త్యాగం చేసిన మైసంపేట గిరిజనులకు భూములు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో గోండుగూడ గిరిజనులు కూడా ఏళ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నారనేది విస్మరించరాదన్నారు. ఒకరికి న్యాయం చేయడానికి మరొకరికి అన్యాయం చేయడం సరికాదని పేర్కొన్నారు. గోండుగూడ గిరిజనులకు ఆ భూములపై హక్కులు లేకపోతే సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎలాంటి ఆధారాలు లేవంటూ..

ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపై ఎఫ్‌డీఓ శివకుమార్ స్పందిస్తూ.. మైసంపేట పునరావాస బాధితులకు ప్రభుత్వం ముందుగానే భూములను కేటాయించిందని తెలిపారు. గోండుగూడ గిరిజనులు తమవని చెబుతున్నప్పటికీ, వాటికి ఎలాంటి చట్టబద్ద ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సుమారు 20 మంది గోండుగూడ గిరిజనులు పునరావాస బాధితులకు కేటాయించిన భూములను ఆక్రమించారని ఆరోపించారు. వారిని తొలగించి భూములను లబ్ధిదారులకు అప్పగించినట్లు చెప్పారు.

గోండుగూడ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశామని వివరించారు. మరోవైపు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగకుండా ప్రభుత్వం, అటవీ శాఖ (Nirmal Forest Department) చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆదివాసీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>