Mobile Popup Ad
Mobile Popup Ad

సార్ అనొద్దు.. అన్నా అని పిలవండి: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తనను సార్ అని పిలవొద్దని, రేవంతన్న అని పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. పదవి ఉన్నా, లేకపోయినా తాను ఎప్పటికీ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. హోదా, పదవులు మారినా ప్రజలతో అనుంబంధం ఏమాత్రం మారబోదన్నారు. తనను కొందరు గుంపు మేస్త్రీ అంటూ అవహేళన చేస్తున్నారని.. అవును, మంత్రుల గుంపు అంతా తనదే అని కుండబద్దలు కొట్టారు. తనలో దొర పోకడలు లేవన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కోసం జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఒకటో తేదీనే జీతాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి అంతా గందరగోళంగా ఉందన్నారు. జీతాలు పదో తేదీ వరకు కూడా చెల్లిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. కచ్చితంగా ఒకటో తేదీనే జీతాలు వేయాలని సంకల్పించుకుని గత రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని, అందుకే వారి సంక్షేమానికి బీమా రక్షణ బాధ్యత తీసుకున్నట్లు వివరించారు.

గంట అదనంగా పనిచేయాలి..

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి గంట సేపు అదనంగా పనిచేయాలని వారిని కోరారు. పన్నులు ఎగ్గొడుతున్నవారి నుంచి వసూళ్లు అయ్యేలా పనిచేయాలని, అలా సమకూరిన డబ్బులను తిరిగి ఉద్యోగుల సంక్షేమానికే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే కేంద్రంతో మాట్లాడి వడ్డీ శాతాన్ని 7 శాతానికి తగ్గించినట్లు చెప్పుకొచ్చారు.

సానుభూతి కాదు.. ఆర్థిక భరోసానే ముఖ్యం..

సింగరేణి కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదన తొలిసారి తన ముందుకు వచ్చినప్పుడు అది ఎలా సాధ్యమవుతుందోననే సందేహం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రమాదవశాత్తూ మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా సొమ్ము అందించడంతో ఆ పథకం విజయవంతమైందన్నారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని వివరించారు. “మనిషి బతికున్నప్పుడు అనేక బంధాలు ఉంటాయి.. కానీ చనిపోయిన తర్వాత సానుభూతి చూపేవారే ఉంటారు.. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువగా ఉంటారు.. అలాంటి సమయంలో ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబాలకు ధైర్యాన్ని, ఆర్థిక భరోసాను అందిస్తుంది..” అని సీఎం అన్నారు.

దివాళా తీయించిన కేసీఆర్..

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విడుదల చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నా అమలు చేసేది ఉద్యోగులేనని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు.

అభివృద్ధి పనులకు ప్రతిపక్షాల అడ్డుపుల్ల..

రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ కామెంట్ చేశారు. మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు అడ్డుపడుతున్నారని అన్నారు. గతంలో అభివృద్ధి కోసం పోరాడినవారే ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా, బయటకు వచ్చినప్పుడు బకాసురుడిలా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

తరచూ ఢిల్లీకి వెళ్లేది అందుకే..

ముఖ్యమంత్రిగా గడచిన 30 నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలు ఒక్కొక్కటిగా ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. తరచూ ఢిల్లీ వెళ్తున్నారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు, పెట్టుబడులు, ప్రాజెక్టుల సాధన కోసమే అని వివరించారు. రాష్ట్ర ఆదాయం పెంచడంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడం కీలకమని, శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఉద్యోగుల సహకారం చాలా అవసరమని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>