కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం (Khammam Tragedy) నెలకొంది. మద్యం మత్తులో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు అందించిన తప్పుడు వైద్యం 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. జలుబు, దగ్గుతో వచ్చిన చిన్నారికి మద్యం తాగి ఇంజెక్షన్ ఇవ్వడంతో అది వికటించి బాలిక ప్రాణాలు కోల్పోయింది. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామంలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా రమేశ్ కుమార్తె హేమశ్రీ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. కొద్దిరోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో తండ్రి రమేశ్ ఆమెను స్థానికంగా వైద్యం చేసే ఆర్‌ఎంపీ సంపత్ వద్దకు తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన సంపత్ వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే హేమశ్రీ అనే బాలిక పరిస్థితి తీవ్రంగా విషమించి ఆకస్మికంగా మృతి చెందింది.
చికిత్స అందించే సమయంలో ఆర్‌ఎంపీ సంపత్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని, అతడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కన్నుమూసిందని హేమశ్రీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపించారు. ఘటన అనంతరం పోలీసులు సదరు ఆర్‌ఎంపీని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా, అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కళ్లెదుటే ఆడుతూపాడుతూ తిరిగే కుమార్తె ఆర్‌ఎంపీ నిర్లక్ష్యానికి బలికావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విద్యార్థిని ఆకస్మిక మరణంతో లింగగూడెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మద్యం మత్తులో వైద్యం చేసి బాలిక ప్రాణాలు తీసిన ఆర్‌ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

