Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం మంత్రులది దోపిడీ పాలన: కేటీఆర్

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అవుతుంటే, కొందరు మంత్రుల వ్యక్తిగత ఆదాయం మాత్రం విపరీతంగా పెరుగుతోందని కేటీఆర్‌ (KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలపై, ఖమ్మం జిల్లా మంత్రుల అక్రమాలపై నిప్పులు చెరిగారు. జిల్లాకు చెందిన మంత్రులు ప్ర‌జాపాలనను గాలికొదిలేసి, పూర్తిగా దోపిడీ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ప్ర‌భుత్వ భూముల దోపిడీ..

​సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో మార్కెట్ విలువకు పూర్తిగా విరుద్ధంగా భూములను అడ్డగోలుగా విక్రయించారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారిక ధర ఎకరాకు రూ.40 లక్షలు ఉంటే, కేవలం రూ.21 లక్షలకే ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టారని, అసలు ప్రభుత్వ భూములను ఎవరి కోసం దోచుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దీనితో పాటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కోట్ల రూపాయల విలువైన మట్టిని కూడా యథేచ్ఛగా తరలిస్తూ దోపిడీ చేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న‌ష్ట‌పోయింది ప్ర‌జ‌లే..

నందమూరి తారకరామారావుతో కలిసే కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ దేశంలో ప్రధానమంత్రి పదవి తప్ప అన్నీ నిర్వహించారన్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆయన వ్యక్తిగతంగా నష్టపోయిందేమీ లేదని, కానీ ఆయన మాట వినకపోవడం వల్ల ఇప్పుడు తెలంగాణ రైతాంగం, ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతుబంధు అందించామని చెప్పారు. అప్పట్లో రైతులు అప్పులు కట్టకపోతే బ్యాంకు అధికారులు వస్తువులు ఎత్తుకెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ ఆ వ్యవస్థను మార్చి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు.

సీఎం ఢిల్లీకి పోయి ఏం తీసుకొచ్చారు?

గతంలో మూడో పంటకు కూడా రైతుబంధు కావాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు సార్లు రైతుబంధును ఎగ్గొట్టిన దివాలా కోరుగా మారారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతులకు రూ.72 వేల కోట్లు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పదవి చేపట్టిన తర్వాత 72 సార్లు ఢిల్లీకి తిరిగారని, అలా పోయి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఆయనకే తెలియాలన్నారు. చివరికి ఐదు ఎకరాల లోపు రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, మొదట రూ.40 వేల కోట్లు అని చెప్పి, ఆపై బడ్జెట్ నాటికి రూ.26 వేల కోట్లకు, ఇప్పుడు రూ.20 వేల కోట్లకు తగ్గించి రూపాయిలో కేవలం 40 పైసల వంతు మాత్రమే రుణమాఫీ అందించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కనీసం ధాన్యం కొనడానికి గన్నీ బ్యాగులు కూడా లేవని, ఆ సంచులు కూడా ఢిల్లీకే పోతున్నాయా అని ప్రశ్నించారు.

భ‌ట్టిది క‌మ‌ల్ హాస‌న్‌ను మించిన‌ యాక్టింగ్‌

​డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కూడా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు భట్టి విక్రమార్క నటుడు కమల్ హాసన్ కంటే బాగా యాక్టింగ్ చేస్తూ బాండ్ పేపర్ల మీద రాసి మరీ హామీలు ఇచ్చారని, ఆ గ్యారంటీ కార్డులను గట్టిగా పట్టుకోమన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ దాచుకోవాలో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, మూడు నెలల్లో పిల్లలు పుట్టరని అందరికీ తెలుసు కానీ, 30 నెలలైనా గ్యారంటీలు అనే పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఏమనాలని నిలదీశారు.

జ‌ర్న‌లిస్టుల‌పై వేధింపులు స‌రికాదు

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా విలేఖరులను కూడా వదలకుండా సతాయిస్తోందని, జర్నలిస్టులను వేధించడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులను ఎలాగైతే గౌరవంగా చూసేవారో, ఇప్పుడు కూడా అలానే చూడాలని డిమాండ్ చేశారు. నాయకులు కొంతమంది వేదికల మీద మారొచ్చు కానీ, క్షేత్రస్థాయిలో ఈ రోజు గులాబీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి కారణం కార్యకర్తలేనని, కష్టకాలంలోనూ పార్టీ గౌరవాన్ని కాపాడిన సత్తుపల్లి నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>