కలం, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో స్వామి వారి దర్శనం కల్పిస్తామంటూ అమాయక భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా దర్శనాల పేరిట భారీగా డబ్బులు వసూలు చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలు ఇప్పిస్తామని, స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొనేలా చేస్తామని నిమ్మల శ్రీనివాసులు అనే వ్యక్తి పలువురు భక్తులను నమ్మించాడు. హైదరాబాద్, గుంటూరు, కర్ణాటకకు చెందిన దాదాపు 60 మంది భక్తుల దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.6,000 చొప్పున మొత్తం రూ. 3.60 లక్షలను ఫోన్ పే ద్వారా తన ఖాతాకు పంపించుకున్నాడు.
తీరా డబ్బులు చేతికంది దర్శన సమయం దగ్గర పడేసరికి సదరు వ్యక్తి మధ్యాహ్నం నుంచి తన మొబైల్ ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు లబోదిబోమంటూ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఈ భారీ మోసంపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం, పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాసులు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భక్తులు ఎవరూ దర్శనాల నిమిత్తం దళారులు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు, టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
Follow Us On : WhatsApp

