epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్

కలం, వెబ్ డెస్క్:  దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR) ప్రక్రియపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు దశలో ఉన్న ఎస్ఐఆర్‌ను తెలంగాణలోనూ నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్(SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, బలహీన వర్గాల ఓటింగ్ హక్కులు దెబ్బతింటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడంతో, ఒకవైపు కేంద్ర ఎలక్షన్ కమిషన్(EC) నిర్ణయం, మరోవైపు పార్టీ జాతీయ నాయకత్వం వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నప్పటికీ, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రక్రియను పూర్తిగా అడ్డుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ నేతల స్పందనేంటి?

ఇక రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై జాగ్రత్తగా స్పందిస్తున్నారు. ఓటర్ల హక్కులు కాపాడేలా, ఎలాంటి తొలగింపులు జరగకుండా పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలని మాత్రమే డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే అభ్యంతరాల నమోదు, అప్పీలు ప్రక్రియలను బలోపేతం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఘర్షణకు వెళ్లే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పార్టీ పరంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే, అధికారికంగా మాత్రం ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే వ్యూహాన్ని తెలంగాణ కాంగ్రెస్ అనుసరించే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Read Also: వాట్సాప్‌లో కొత్త మోసం… వీసీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>