కలం, వెబ్ డెస్క్ : కన్నతల్లిలాంటి బీఆర్‌ఎస్(BRS) పార్టీలోనే ఉంటూ కొందరు నాయకులు నమ్మకద్రోహం చేస్తున్నారని, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మండిపడ్డారు. పార్టీని బలహీనపరచాలని చూస్తున్న ఆ ద్రోహులను గుర్తించి తక్షణమే సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్ఠానానికి పిలుపునిచ్చారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించినప్పటికీ, కొందరు అంతర్గత శత్రువులు కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు.
పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారు ఎంతటి స్థాయి నాయకులైనా సరే, వారిని క్షమించబోమని హెచ్చరించారు. వెన్నుపోటు పొడవాలని చూస్తే సహించబోమన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని.. కానీ, కొందరు స్వార్థపరులు పార్టీలో ఉంటూ బయటి శక్తులతో కుమ్మక్కవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరచిన సర్పంచులు విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి అంతర్గత ద్రోహమే కారణమని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని, అయితే వారికి తమ పార్టీలోని కొందరు సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: రెండేళ్లు ఆగాము.. ఇక ఆగేది లేదు.. నేను కూడా హాజరవుతా -KCR
Follow Us On: X(Twitter)


