నల్లగొండ BRS లో గ్రూప్ పాలిటిక్స్​.. టార్గెట్​ జగదీశ్​?

కలం, నల్లగొండ బ్యూరో: ఒకప్పుడు తిరుగులేని గులాబీ కోటగా వెలిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ (Nalgonda BRS) ప్రస్తుతం అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) వైఖరి వల్లే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 చోట్ల తీవ్రమైన ‘కోల్డ్ వార్’ నడుస్తున్నదని, భవిష్యత్తులో తమకు అడ్డు వస్తారనే నెపంతో సీనియర్లను తొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి కేడర్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ బాస్ కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు సీనియర్లు వ్యూహరచన చేస్తుండటం ఉత్కంఠ రేపుతున్నది.

భగ్గుమంటున్న అసంతృప్తి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దాదాపు 10 చోట్ల గ్రూపు రాజకీయాలు పెరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు బయటపడని అసంతృప్తి ఇప్పుడు భగ్గుమంటున్నది. భవిష్యత్తులో తనకు ఎదురులేకుండా ఉండాలనే వ్యూహంతో జగదీశ్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక సమాంతర గ్రూపును ప్రోత్సహించారని ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కాలం నుంచే ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులను ఉసిగొల్పారని ప్రచారం ఉంది.

కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మలయ్యకు (Bollam Mallaiah Yadav) చెక్ పెట్టేందుకు మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు నేతలను వెనకుండి నడిపించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హుజూర్‌నగర్, భువనగిరి, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు, ఆలేరు, మిర్యాలగూడల్లో కూడా ఇదే తరహా రాజకీయాల వల్ల కేడర్ నష్టపోయిందని ఆరోపిస్తున్నారు.

రబ్బర్ స్టాంపులుగా జిల్లా అధ్యక్షులు!

పార్టీని బలోపేతం చేయాల్సిన జిల్లా అధ్యక్షులు రబ్బర్ స్టాంపులుగా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పదవుల్లో ఉన్నా.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. జగదీశ్ రెడ్డి అనుమతి లేకుండా కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో వారున్నారనే భావన గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. సమర్థులను పక్కనపెట్టి, తన మాట వినేవారికే పదవులు కట్టబెట్టారని కేడర్లో అసంతృప్తి ఉంది. తాజాగా పార్టీ కొత్త జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలైనప్పటికీ.. బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నది.

పార్టీ మారే యోచనలో నేతలు?

ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. ఒకవేళ కేసీఆర్ తమ ఫిర్యాదును పట్టించుకోకుండా జగదీశ్ రెడ్డికే మద్దతునిస్తే, పార్టీలో కొనసాగడం వృథా అని ఆ నేతలు భావిస్తున్నారు. అధినేత స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని, అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధంగా ఉండాలని వారు మానసిక కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

గుత్తా అందుకే వెళ్లిపోయారా..?

– బీఆర్ఎస్‌లో ఉండగా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌కు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా జగదీశ్ రెడ్డి అడ్డుపడ్డారని, అందుకే గుత్తా కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం ఉంది.
– అప్పట్లోనే ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.
– గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే నల్లగొండలో పార్టీ పట్టు కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

Read Also: ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఎముకలు బలహీనపడతాయా? నిపుణులు చెప్పిన నిజమిదే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>