Mobile Popup Ad
Mobile Popup Ad

వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కోటా మేరకే వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయం తీసుకుంది. చివరి గింజ వరకు కొన్నా కేంద్రం తీసుకోవడం లేదని, కోటా మేరకే తీసుకుంటున్నందున ఈ నిర్ణయం తప్పడం లేదని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రుల సమావేశం జరిగింది. వడ్ల కొనుగోళ్లపై ఇందులో కీలక నిర్ణయం వెలువడింది. ఇప్పటి వరకూ చివరి గింజ వరకూ కొంటామని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు దాని స్థానంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం వివరాలను మంత్రి ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. “కేంద్రం నిర్ణయించిన విధివిధానాల ప్రకారమే రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏయే పంటలకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయించాం” అని ప్రకటించారు.

రైతు భరోసాకు డేట్ ఫిక్స్

వానాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని వ్యవసాయ, ఆర్థిక శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన నిధులు విడుదల చేస్తారు.

33 రకాల స్థానంలో 7 రకాలకే బోనస్

ఇప్పటి వరకూ 33 రకాల సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌ ఇచ్చే విధానం ఉండగా.. ఇకపై కేవలం ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేశారు. మార్కెట్‌లో డిమాండ్, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 రకాలకే బోనస్ వర్తిస్తుంది.

మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..

– రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశారు. 80 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. కేంద్రం తక్కువ ధాన్యాన్నే సేకరిస్తున్నది. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
– వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలి. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్‌లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణకే కేటాయించాలి.
– మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కొత్త జీ-రామ్-జీ పథకం అమలుతో కూలీలు, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామితో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
– హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు అవసరమైన అన్ని అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రావాల్సిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. నగర ట్రాఫిక్ సమస్యలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఫేజ్-2 కీలకం. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి రావాలి. అవసరమైన అనుమతులు సాధించడంలో సహకరించాలి.
– ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలి. ‘తెలంగాణ డిజిటల్ క్యాబినెట్’ రూపంలో కొనసాగనున్నాయి. మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌ల పంపిణీ. క్యాబినెట్ ఎజెండా, నోట్స్, సంబంధిత పత్రాలన్నీ డిజిటల్ రూపంలోనే ఉంటాయి.
– ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>