కలం, కరీంనగర్ బ్యూరో: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వీకెండ్ ఎమ్మెల్యే అని.. ప్రజల కోసం మాట్లాడే తీరిక ఆయనకు లేదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సిరిసిల్లలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. సిరిసిల్ల చౌరస్తాలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూల మాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సెస్ ను తీసేసినా.. రైతు డిస్కం పెడతామన్న ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం బంద్ పెట్టాడని.. ఆయనను ప్రజలే పోరాటానికి సిద్ధం చేయాలని చెప్పారు.
కేటీఆర్.. సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేకపోయారని అన్నారు. అక్రమ సంపాదన కోసం నెరేళ్లలో ఎస్సీ, బీసీలను ఘోరంగా కొట్టించాడని ఆరోపించారు. వాళ్లకు అండగా ఉంటామన్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి మోసం చేశారని ఫైర్ అయ్యారు. నెరేళ్ల బాధితులకు అండగా ఉండి తాము న్యాయం చేసి చూపిస్తామన్నారు. సిరిసిల్లలో సెస్ అనే సంస్థ ఉండేదని.. దాన్ని గవర్నమెంట్ లో కలిపేశారని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం డిస్కం ఏర్పాటు చేస్తామంటే కూడా దాని గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఆయన వీకెండ్ లో వచ్చి పోయే ఎమ్మెల్యే. తీరిక లేక మాట్లాడలేదేమో? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
కవిత కీలక వ్యాఖ్యలు..
సిరిసిల్ల నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షా 8 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉండగా, కేవలం 480 ఎకరాలకు మాత్రమే అందుతున్నాయని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి తర్వాత తానేనని చెప్పుకునే ఇక్కడి ఎమ్మెల్యే నీళ్లు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. అలాగే వేములవాడలో ఇంకా 77 వేల ఎకరాలకు కాళేశ్వరం నీరు అందాల్సి ఉందన్నారు. సిరిసిల్ల పద్మశాలీ ముద్దుబిడ్డల అడ్డా అని కొనియాడిన కవిత, ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించి న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే మాట తప్పారని విమర్శించారు. వర్కర్ టు ఓనర్ పథకం పూర్తి చేయకపోవడం వల్లే చేనేత కార్మికులు ఇప్పటికీ వలసలు వెళ్లాల్సి వస్తోందని, సిరిసిల్లలో కార్మికులు ఉంటే వేములవాడలో యారన్ డిపో పెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ పార్టీ జెండాలోని పసుపు రంగు ఆడబిడ్డలకు, నీలం రంగు శ్రామికులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీలకు సూచిక అని వివరించారు. రాష్ట్రంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు చేయకూడదనే పంతంతో ఉచిత విద్య, వైద్యం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యువత స్వయం ఉపాధి కోసం 2 నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని తెంపేసుకుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణపై మాట్లాడటం లేదని విమర్శించారు.
తొమ్మిదేళ్లయినా నెరేళ్ల దళిత, బీసీ బాధితులకు న్యాయం జరగలేదని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ అక్రమ సంపాదనతో కళ్లు మూసుకుపోయి బాధితులను పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ల వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల విచారణ జరిగేలా బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తానే స్వయంగా వారం రోజుల్లో నెరేళ్ల బాధితులను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలను తీసుకొని ధర్మం వైపు నిలబడతామని, సిరిసిల్లలో టీఆర్ఎస్ గెలిచే వరకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

