కలం, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ నల్లగొండ జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి శ్రమిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని, ఇది మన చరిత్రలో అత్యంత కీలకమైన రోజు అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులు, మహిళలు, యువత, కార్మికుల భాగస్వామ్యంతో రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, కిమ్స్ ఎల్బీనగర్కు కూడా ఆయన పేరు పెట్టాలని సీఎంను కోరినట్లు చెప్పారు.
అలాగే ఆల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో 2,34,281 మంది రైతులకు రూ.2,005.01 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, ఉచిత విద్యుత్, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రూ.1,829 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పాఠశాల యూనిఫారాల తయారీ నుండి పెట్రోల్ బంకుల నిర్వహణ వరకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్ఎల్బీసీ వద్ద రూ.3.50 కోట్లతో మహిళా పెట్రోల్ బంక్, రూ.2.50 కోట్లతో నీలగిరి మహిళా మార్ట్‌ను ప్రారంభించామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని తెలిపారు.
నకిరేకల్‌లో రూ.32 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, రూ.200 కోట్లతో కడపర్తిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.20 కోట్లతో నర్సింగ్ కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా, బీ ఫార్మసీ కోర్సులను ప్రారంభించామని తెలిపారు. రూ.596 కోట్లతో నల్లగొండ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మొదటి విడత కింద జిల్లాలో 17,873 ఇందిరమ్మ ఇళ్లను రూ. 459 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని, రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే వార్డు స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రూ.20 లక్షల బహుమతి సాధించిన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సిబ్బందికి మంత్రి చెక్కును అందజేశారు.

