బీహార్‌లో ఎన్నికల(Bihar Elections) వేడి రోజురోజుకు పెరుగుతోంది. కూటముల్లో సీట్ల సర్దుబాటు కుమ్ములాటలకు దారితీస్తోంది. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరు అన్న అంశంపై ‘మహాగఠ్‌బంధన్’ కూటమిలో మనస్పర్థలు తలెత్తాయి. అయితే తాజాగా బీజేపీకి కూడా తొలి సొంతింటి పోరు ఎదురైంది. ఎన్‌డీఏ కూటమిలో భాగమైన హిందుస్థాన్ అవామ్ మోర్చా(HAM) పార్టీ తమకు 15 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. అలాకాని పక్షంలో తాము ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ(Jitan Manjhi) కీలక ప్రకటన చేశారు. తమకు కూడా ఒక గుర్తింపు ఉండాలంటే గౌరప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ‘‘మేం 15 సీట్లు డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయం. నేనేమీ సీఎం పోస్ట్ అడగట్లేదు కదా? మా పార్టీకి కూడా గుర్తింపు కావాలని మాత్రమే అడుగుతున్నా’’ అని ఆయన తెలిపారు.
ఎన్నికల ముందు మిత్రపక్షం నుంచి ఇటువంటి డిమాండ్ వినిపించడంతో బీజేపీలో కాస్తంత గందరగోళం ఏర్పడింది. వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ రంగంలోకి దిగారు. సీట్ల సర్దుబాటు అంశంపై జీతర్ రామ్‌తో మాట్లాడారు. ఆయనను బుజ్జగించే పనిలో ప్రస్తుతం బీజేపీ ఫుల్ బిజీగా ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షంలో కూడా కుమ్ములాటలు తలెత్తడంతో ఈసారి బీహార్ ఎన్నికలు(Bihar Elections) మరింత ఉత్కంఠ భరితంగా మారింది. కూటముల్లో తలెత్తున్న కుమ్ములాటలు ఎంత దూరం వెళ్తాయో? అన్న చర్చ కూడా మొదలైంది. కూటములు చీలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

