కోనసీమ(Konaseema) జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అది కాస్తీ అగ్నిప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవదహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని అనపర్తి ఆసుపత్రికి తరలించారు. స్థానిక సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 40 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పేలుడు ధాటికి తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. మరికొందరు ఆ శిథిలాల కింద ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని రామచంద్రపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘అంబేద్కర్ కోనసీమ(Konaseema) జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం’’ అని అన్నారు.
ప్రమాదంపై కలెక్టర్ మహేష్ కుమార్ స్పందిస్తూ.. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.

