కలం, వెబ్ డెస్క్ : జాతీయ ఉపాధిహామీ స్కీం (MGNREGA) పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ శనివారం తెలంగాణలో తీవ్ర ఆందోళన చేపట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి, ఈ పథకాన్ని ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (VB-G RAM G)గా మార్చటాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపు మేరకు సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్‌పై గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ ఆందోళనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరును తొలగించడం అంటే జాతిపితను అవమానించడమే అన్నారు. ఉపాధి హామీ పథకం (MGNREGA) గ్రామీణ భారతానికి జీవనాధారం అని, బీజేపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలపై 40శాతం ఆర్థిక భారం మోపి, ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
Read Also: బిహార్ డాక్టర్‌కు జార్ఖండ్ సర్కార్ ఆఫర్
Follow Us On: Instagram


