కలం, నల్లగొండ బ్యూరో : హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి(Shanampudi Saidireddy) తిరిగి గులాబీ గూటికి చేరనున్నాడా..? అంటే పరిస్థితిని చూస్తే.. అవుననే అన్పిస్తోంది. సైదిరెడ్డి గత కొంతకాలంగా బీజేపీ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడం.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) క్యాడర్ తెర వెనుక ఉండి నడిపించడం.. తదితర పరిణామాలన్నీ సైదిరెడ్డి రాకకు బలం చేకూరుస్తున్నాయని చెప్పాలి. నిజానికి బీజేపీ రాజకీయాలకు సైదిరెడ్డి ఇమడలేకపోతున్నారని.. పార్టీపరంగా తీసుకునే నిర్ణయాలతో పాటు క్యాడర్‌లోనూ ఎంతకీ జోష్ రాకపోవడం.. ఇప్పట్లో నల్లగొండ జిల్లాలో ఆ పరిస్థితి కన్పించేలా లేకపోవడంతో యూటర్న్ తీసుకునేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ యోచన సైతం అతిత్వరలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ శానంపూడి సైదిరెడ్డిని తిరిగి గూలాబీ గూటికి రానిస్తారా..? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మాదిరిగానే హుజూర్‌నగర్(Huzur Nagar) నియోజకవర్గ బీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. గతంలో శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్‌ను వీడేందుకు అది ఒక కారణమే. అలాంటి పరిస్థితుల్లో సైదిరెడ్డి పునరాగమనం సాధ్యం కావడం కష్టతరమే.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్‌తో టచ్‌లోకి..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి(Shanampudi Saidireddy) కొన్ని మండలాల్లో యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ క్యాడర్‌తో మాట్లాడి పంచాయతీల్లో గెలిచేందుకు పావులు కదిపారు. ప్రధానంగా సైదిరెడ్డి సొంత మండలం మఠంపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి, మేళ్లచెర్వు మండలాల్లో క్యాడర్‌తో చర్చలు జరిపి సూచనలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు.. తమకు గెలిచే దమ్ము ఉన్నా.. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నప్పటికీ మాకు అండగా నిలిచే వారు లేరని మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సైదిరెడ్డి బహిరంగంగా ఎక్కడా కన్పించకపోయినప్పటికీ తెర వెనుక మంతనాలు, వ్యుహాలు పన్నారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్‌లోనూ పెద్దఎత్తున చర్చ కావడంతో పాటు జోష్ వచ్చింది. ఒకానొకదశలో బీఆర్ఎస్‌లో చేరిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
పెద్ద దిక్కు లేకుండా పోయిన హుజుర్‌నగర్ బీఆర్ఎస్
సైదిరెడ్డి బీఆర్ఎస్ వీడి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి హుజూర్‌నగర్ బీఆర్ఎస్‌కు పెద్దదిక్కు లేకుండా పోయింది. దీంతో పార్టీ సైతం సెలైంట్ మోడ్‌లోకి వెళ్లింది. ఓ సీనియర్ లీడర్‌ను సమన్వయకర్తగా నియమించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదు. పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా క్యాడర్‌ను కదిలించే వారు లేకుండాపోయారు. ఇలాంటి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర దుస్థితికి ఆదే కారణం. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడర్ ఉవ్విళ్లూరినప్పటికీ వారికి పెద్ద దిక్కుగా నిలిచే లీడర్ కరువయ్యాడు. దీంతో క్యాడర్ మాత్రమే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెండుమూడుసార్లు ఇలా వచ్చి అలా మెరిసిపోయినా ప్రయోజనం శూన్యమే. ఓవైపు మంత్రి ఉత్తమ్ ఏకపక్షంగా పంచాయతీలను గెలుచుకుంటూ పోతుంటే.. బీఆర్ఎస్‌కు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. సపోర్టుగా నిలిచే లీడర్ లేక బిత్తరచూపులు చూడాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. అన్ని పరిస్థితులు కలిసి వస్తే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయానికి శానంపూడి సైదిరెడ్డి గులాబీ గూటికి చేరతారనే ప్రచారం లేకపోలేదు.
Read Also: నేడు ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


