కలం వెబ్ డెస్క్: ఆకు రౌడీలకు కాలుకు కాలు, కీలుకు కీలు తీసి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) లాంటి ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడడని, కిరాయి గ్యాంగులను అంతం చేసేందుకు రెండు రోజులు చాలు అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో నిర్మించనున్న “అమరజీవి జలధార”(Amarajeevi Jaladhara Project) పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మళ్లీ వైసీపీ(YCP) నేతలకు అలాంటి మాటలు రావని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదని, మళ్లీ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. గీతలు దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగదీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు బాధ్యత మరిచి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. మళ్లీ మేం అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామంటున్నారని, కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామని బెదిరిస్తున్నారని అలా బెదిరించే నాయకులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కోసం చేపట్టిన జె.జె.ఎం.వాటర్ గ్రిడ్(JJM Water Grid) పథకానికి అమరజీవి జలధార అని నామకరణం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టినట్లు డిప్యూటీ సీఎం Pawan Kalyan తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లో రూ.7,910 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కువగా తీర ప్రాంతాలను కలిపే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని, 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పర్యటన దృష్ట్యా స్థానికంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, మంత్రులు కొలుసు పార్థసారథి, దుర్గం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: థర్డ్ డిగ్రీ ప్రయోగించి నన్ను చంపాలని చూశారు: బోరుగడ్డ అనిల్ కుమార్
Follow Us On: X(Twitter)


