కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, తప్పును ప్రశ్నించిన పోలీసులపైనే ఒక మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన (Hyderabad Woman Argues) ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని ఒక ప్రాంతంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళను ట్రాఫిక్ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు.
నన్ను ఎందుకు ఆపుతారంటూ సదరు మహిళ పోలీసులతో గొడవకు దిగింది. నిబంధనలు అందరికీ ఒకటేనని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం వినకుండా రచ్చ రచ్చ చేసింది. మహిళ ప్రవర్తన మితిమీరడంతో అక్కడే ఉన్న స్థానికులు సైతం జోక్యం చేసుకున్నారు. తప్పు చేసి పోలీసులపై గొడవకు దిగడం ఏంటని ఆమెను నిలదీశారు. పోలీసుల విధులకు అడ్డుతగలకుండా వారికి సహకరించాలంటూ స్థానికులు సదరు మహిళకు హితవు పలికారు.
అయితే, ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే పోలీసులు సదరు వాహనం నంబర్‌ను తమ డివైజ్‌లో తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వాహనంపై గతంలోనే ఏకంగా 20 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలింది. దీంతో అంతసేపు పోలీసులపై కేకలు వేసిన మహిళ ఒక్కసారిగా అడ్డంగా దొరికిపోయింది. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ, భారీగా చలాన్లు పెండింగ్‌లో పెట్టి, పైగా పోలీసులపైనే రుసరుసలాడిన ఈ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: టీజీ20 లీగ్ : భారీ రేటుతో మెరిసిన డీజీపీ కుమారుడు!
Follow Us On: X(Twitter)

