కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల కోసం త్వరలో ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన కంపెనీ రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160 అనే హెలికాప్టర్ తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక మధ్య తరహా ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లలో ఇది ఒకటని ఏవీయేషన్ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం, ఇంటెలిజెన్స్ సూచనల మేరకు రాష్ట్ర సివిల్ ఏవీయేషన్ విభాగం ఆధ్వర్యంలో అధ్యయనానికి త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు కానుంది. దీని సిఫార్సుల మేరకు కొత్త హెలికాప్టర్ తెచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నెలకు రూ.5 కోట్ల అద్దె..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 8 సీట్లతో కూడిన ఆగస్థ్య-169 హెలికాప్టర్‌ను ఉపయోగిస్తోంది. సీఎంతో పాటు మంత్రులు కూడా దీనిలో ప్రయాణిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో దీన్ని పార్క్ చేయగా.. అద్దె కోసం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెక్యూరిటీ అధికారుల సిఫార్సు మేరకు సీఎం కోసం ప్రత్యేకంగా ఎయిర్‌బస్ హెచ్-160 వాడాలని యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 6, 8, 12 సీట్ల సామర్థ్యం కలిగి రెండు ఇంజిన్లు ఉన్న ఈ హెలికాప్టర్ గంటకు 255 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. ఆగకుండా నాలుగున్నర గంటల పాటు వెళ్లగలదు. ఆటో పైలట్, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో తయారు చేసిన ఈ హెలికాప్టర్ లోపలికి ఇంజిన్ల శబ్ధం ఏమాత్రం వినిపించకపోవడం దీని ప్రత్యేకత. దీని అద్దె నెలకు సుమారు రూ.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

