కలం, వెబ్ డెస్క్: గూడు (Nest) అనగానే మనకు వెంటనే పక్షులే గుర్తొస్తాయి. కానీ ప్రకృతిలో పక్షులకు దీటుగా, అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో గూళ్లు కట్టే జంతువులు చాలా ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మనుగడ కోసం, శత్రువుల నుండి రక్షణ కోసం ఇవి నిర్మించుకునే నివాసాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పెద్దపెద్ద ఆర్కిటెక్చర్‌ను సైతం ఇన్‌స్పైర్ చేసేలా ఉంటాయి ఈ గూళ్లు. అందానికి అందం, రక్షణకు రక్షణ ఇలా ఆ గూళ్ల విశేషాలు చెప్పాలంటే చాలానే ఉంటాయి. ఇంతకీ ఇంత అద్భుతమన గూళ్లు కట్టే ఆ 7 ఆర్కిటెక్చర్ జంతువులు (Amazing Animals) ఏంటో తెలుసా..
బీవర్లు: ఇవి నీటి ప్రవాహాలకు అడ్డుగా కర్రలు, మట్టితో బలమైన గూళ్లను కడతాయి. శత్రువుల కంటపడకుండా ఉండటానికి గూటికి వెళ్లే దారిని నీటి లోపల ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి చలికాలంలో లోపల వెచ్చదనాన్ని ఇస్తాయి.
ఒరాంగుటాన్లు: ఇవి ప్రతిరోజూ అడవుల్లో ఎత్తైన చెట్లపై కొమ్మలు, ఆకులతో గూళ్లను అల్లుకుంటాయి. ఇవి చాలా బలంగా ఉండి, ఎత్తులో ఉండటం వల్ల శత్రువుల నుండి వీటికి రక్షణ లభిస్తుంది.
మొసళ్లు: ఆడ మొసళ్లు మట్టి, మొక్కలతో మేటలాంటి గూళ్లను కడతాయి. ఆ మొక్కలు కుళ్ళిపోతున్నప్పుడు వెలువడే వేడి ద్వారా మొసలి గుడ్లు సహజంగానే పొదుగుతాయి.
కుందేళ్లు: ఇవి పొదల్లో లేదా భూమి లోపల గడ్డి, వెంట్రుకలతో మెత్తని గూళ్లను తయారు చేసుకుంటాయి. ఇవి వాతావరణ మార్పుల నుండి, క్రూర జంతువుల నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి సహాయపడతాయి.
కందిరీగలు: చెక్క గుజ్జును లాలాజలంతో కలిపి ఇవి పేపరు వంటి పటిష్టమైన గూళ్లను కడతాయి. వీటి గూళ్ల నిర్మాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ పజిల్‌లా అనిపిస్తుంది.
స్టిక్ల్‌బ్యాక్ చేపలు: ఇవి నీటి అడుగున మొక్కల ముక్కలను ఒక రకమైన జిగురుతో అతికించి గూళ్లు కడతాయి. గుడ్లను భద్రంగా ఉంచడానికి మగ చేపలు ఈ పని చేస్తాయి.
గొరిల్లాలు: ఇవి ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి కొత్తగా గూళ్లను సిద్ధం చేసుకుంటాయి. ఆకులు, కొమ్మలతో కట్టుకునే ఈ నివాసాలను ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడవు. దీనివల్ల శుభ్రత, సౌకర్యం లభిస్తాయి.

