కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో విద్యాశాఖకు సంబంధించి భారీగా నిధులు గోల్‌మాల్ అయ్యాయి. పదోతరగతి విద్యార్థుల పుస్తకాల పేరిట 46 లక్షల రూపాయల దారి మళ్లించారు. ఈ కేసులో తాజాగా ఓ అధికారిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. పదో తరగతి విద్యార్థుల కోసం గతంలో విద్యాశాఖ దిక్సూచీ అనే పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పథకం మాటున భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. రూ.46 లక్షల 50 వేల రూపాయలు దారిమళ్లినట్టు సమాచారం. నిధులను డ్రా చేసి పుస్తకాలు మాత్రం ఇంతవరకు విద్యాశాఖ కార్యాలయానికి పంపించలేదు. గతంలో పని చేసిన విద్యాశాఖ ఏడీ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి రాగానే జిల్లా ఆడిట్ అధికారికి తెలిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు కేవలం 4,635 మంది ఉండగా 15,000 పుస్తకాల ముద్రణ అవసరమని కోరినట్టు తెలిసింది. ఇందుకు సంబంధితశాఖ ద్వారా సరైన అనుమతులు లేకుండా అలాగే పుస్తకాల కొనుగోలు కమిటీ ద్వారా చేయలేదని తేలింది. ఓపెన్ టెండర్ పద్ధతిని పాటించలేదని, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆడిట్ అధికారులు తమ నివేదికల ద్వారా తేల్చి చెప్పారు.
అడిట్ నివేదికలతోపాటు నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. ఈ మేరకు దీనికి సంబందించిన ఆధారాలు లేకుండా జీ మెయిల్ అకౌంట్ నుంచి తొలిగించినందుకు శ్రీకాంత్‌పై చట్టప్రకారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అంతేగాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న హనుమకొండ రుత్విక్ గ్రాఫిక్స్, ప్రొప్రైటర్ విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

