కలం, వెబ్ డెస్క్: సుధీర్ఘ కాలం దేశాన్ని దోచుకుతినడంలో మోదీ (Modi)ది చెరపలేని చరిత్ర అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా షర్మిల ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. మోదీ పన్నెండేళ్ల పాలన దేశానికి పట్టిన దౌర్భాగ్యం అని షర్మిల విమర్శించారు. పుష్కర కాలంగా సాగుతున్నది సుపరిపాలన కాదని, మోదీ “స్వ పరిపాలన” అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో సామాన్యుడికి అచ్చే దిన్ కాదని, బ్రతకలేక చూయిస్తున్నది సచ్చేదిన్ అని కామెంట్ చేశారు.
బీజేపీ పాలనలో దేశ పౌరుల బతుకులు ఛిద్రమవుతున్నాయని, దేశ వనరులను మోదీ, అదానీలు దోచుకోవడమే 12 ఏళ్ల అసమానమైన రికార్డ్ అని షర్మిల అన్నారు. కొందామంటే కొనలేం.. ఉందామంటే ఉండలేం.. మొత్తంగా బతుకలేం.. ఇదే 12 ఏళ్లలో ప్రధాని సాధించిన అద్భుత మేక్ ఇన్ ఇండియా అని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా షర్మిల పన్నెండేళ్లలో మోదీ సాధించిన పన్నెండు విజయాలు ఇవేనంటూ ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. డాలర్‌తో రూపాయి విలువ రూ.58.66 నుంచి రూ.96.95 కు తాకడం, అమెరికా ఎదుట దేశ ప్రధాని బానిసత్వం చేశారని ఇందులో పేర్కొన్నారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు 300 శాతం పెరిగాయని, రూ.191 లక్షల కోట్ల కొత్త అప్పులు తీసుకొచ్చి 140 కోట్ల భారతీయుల ఒక్కో తలపై 1.80 లక్షల అప్పు పెట్టారని విమర్శించారు.
మోదీ ఇస్తామన్న 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో 25 శాతం నిరుద్యోగం పెరిగిపోయిందని షర్మిల అన్నారు. మణిపూర్‌లో నడిరోడ్డుపై నగ్నంగా మహిళలను ఊరేగింపులు, ఏడాదికి 5 లక్షల మంది ఆడబిడ్డలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నుల వాతలు పెరిగాయని, 12 ఏళ్లలో 329 లక్షల కోట్ల అధిక పన్ను వసూళ్లు జరిగాయని షర్మిల పేర్కొన్నారు. దేశ భద్రత గాలికొదిలేయడంతో 12 ఏళ్లలో 68 ఉగ్రదాడులు జరిగాయని విమర్శించారు. దేశంలో ఏడాదికి 12 వేల మంది రైతుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. సూడాన్, రువాండాను వంటి దేశాలను దాటుకొని ప్రగతి సూచీ 114 నుంచి 143కి పడిపోయిందని చెప్పారు. 12 ఏళ్లలో 28 సార్లు పేపర్ లీకులు జరిగాయని, మతఘర్షణలు, మణిపూర్, గోద్రా అల్లర్లతో మైనారిటీలపై ఊచకోతలు జరిగాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాం అని డబ్బా కొట్టుకునే ముందు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి పాలన అందించామని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని షర్మిల హితవు పలికారు.

