epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది సజీవ దహనం

సౌదీ అరేబియా(Saudi Arabia)లోని మక్కా, మదీనా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువగా హైదరాబాద్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో మక్కా నుంచి మదీనా వెళ్తున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని తెలుస్తోంది.

మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాల నుంచి పలువురు వెళ్లినట్లు తెలిసింది. అయితే వారి వివరాలు పూర్తిగా నిర్ధారణ కాలేదు. బస్సులో మొత్తం మహిళలు, చిన్నారులు సహా కుటుంబాలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న వెంటనే భారీ మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది. బస్సు పూర్తిగా కాలిపోయినందున మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్, పోలీసులు చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి మాత్రమే బయటపడినట్లు సమాచారం.

ఘటనపై జెడ్డాలోని భారత ఎంబసీ స్పందించి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. మృతుల వివరాలు, వారు ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారన్న అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. కాగా, మరణాల సంఖ్యపై, మృతుల పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ విషాదంపై భారత ప్రభుత్వం నుంచి కూడా ఇంకా స్పష్టత రాలేదు. మధ్యాహ్నానికి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని హజ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఘటనతో హైదరాబాద్‌లోని యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బంధువుల వివరాలు తెలుసుకోవడానికి అనేక మంది సంబంధిత ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: షూటర్ ధనుష్‌కు తెలంగాణ సర్కార్ భారీ బహుమతి..

Follow Us on : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>