Mobile Popup Ad
Mobile Popup Ad

ఐఫోన్ వాడేవారికి డేంజర్ బెల్స్.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

కలం, వెబ్ డెస్క్ : ఐఫోన్ వినియోగంతో బర్త్ రేట్ పడిపోతున్నదా? ఐఫోన్ నెట్‌వర్క్ ఎక్కువగా ఉన్న చోట సంతానోత్పత్తి ఊహించని విధంగా తగ్గుతున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఐఫోన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి తగ్గుతున్నట్టు పరిశోధనల్లో (iPhone Fertility Study) తేలింది. సాధారణంగా ఏదైనా దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు జనాభా పెరుగుతుంది. కానీ రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విచిత్రమైన మార్పు కనిపిస్తున్నది. 2007 నుంచి ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆర్థిక పరిస్థితులు ఉన్న దేశాల్లో సైతం బర్త్ రేట్ పడిపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందుకు ఐఫోన్/స్మార్ట్‌ఫోన్ ప్రధాన కారణమని స్టడీల్లో తేలడం గమనార్హం.

అమెరికాలో మొదలైన క్షీణత

‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’ నివేదిక ప్రకారం.. అమెరికాలో 1980 నుంచి 2007 వరకు ప్రతి వెయ్యి మంది మహిళలకు పుట్టే పిల్లల సంఖ్య (ఫెర్టిలిటీ రేట్) 65 నుంచి 70 మధ్య స్థిరంగా ఉండేది. కానీ 2007 తర్వాత వేగంగా పడిపోవడం మొదలైంది. 2024 నాటికి 54కు పడిపోయింది. అంటే కేవలం 17 ఏళ్లలోనే 22 శాతం తగ్గింది. 2007-2011 మధ్య అమెరికాలో బర్త్ రేట్‌పై ఐఫోన్ ప్రభావం ఎలా ఉందనే దానిపై ఈ స్టడీ (iPhone Fertility Study) ఫోకస్ పెట్టింది. ఆ సమయంలోనే ఐఫోన్ల నెట్‌వర్క్ బాగా విస్తరించింది. ఎక్కడైతే నెట్‌వర్క్ ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో బర్త్ రేట్‌పై ఎక్కువగా ప్రభావం చూపినట్టు స్టడీలో తేలింది.

తాజా స్టడీ ప్రకారం.. అమెరికాలో ఐఫోన్ కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏళ్ల లోపు యువతుల్లో బర్త్ రేట్ 4.5 నుంచి 8 శాతానికి, 20 నుంచి 24 ఏళ్ల యువతుల్లో 3.2 నుంచి 6.6 శాతానికి తగ్గింది. 2007-2011 మధ్య కాలంలో 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో బర్త్ రేట్ దాదాపు 33 నుంచి 52 శాతం వరకు పడిపోయిందని, దానికి ఐఫోన్ కారణమని స్టడీ అంచనా వేసింది. 2007–2024 మధ్య కాలంలో 15 నుంచి 19 ఏళ్ల లోపు యువతుల్లో బర్త్ రేట్ 70 శాతం పడిపోగా, 20 నుంచి 24 ఏళ్ల యువతుల్లో 47 శాతం పడిపోయింది. 30 నుంచి 34 ఏళ్ల మహిళల్లో కేవలం 7 శాతం తగ్గింది. అదే సమయంలో 35 నుంచి 39 ఏళ్ల మహిళల్లో మాత్రం బర్త్ రేట్ 14 శాతం పెరిగింది.

కారణాలేంటి?

అమెరికాలో బర్త్ రేట్ తగ్గడానికి ఐఫోన్ ఒక్కటే కారణం కాదని, కానీ అది ఎక్కువగా ప్రభావం చూపిందని రీసెర్చర్లు పేర్కొన్నారు. అందుకు కొన్ని కారణాలను విశ్లేషించారు.

డిజిటల్ అటాచ్:

ఐఫోన్/స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక యువత బయట స్నేహితులతో ప్రత్యక్షంగా గడిపే సమయం తగ్గిపోయింది. దీనివల్ల మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా జంటల్లో శృంగార కార్యకలాపాలు తగ్గాయి.

పోర్నోగ్రఫీ:

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ‘పోర్న్’ కోసం సెర్చ్ చేయడం రెట్టింపు అయింది. ఇంటర్నెట్‌లో పోర్న్ చూడటం విపరీతంగా పెరిగింది. అది శృంగారానికి ప్రత్యామ్నాయంగా మారిందని పరిశోధకులు భావిస్తున్నారు.

అవగాహన పెరగడం:

ఐఫోన్/స్మార్ట్ ఫోన్ వల్ల యువతకు అవాంఛిత గర్భాలను నిరోధించే పద్ధతులు, గర్భనిరోధకాలు, అబార్షన్ల గురించి సమాచారం సులభంగా అందుబాటులోకి వచ్చింది.

మనుషులు నేరుగా కలిసి మాట్లాడుకునే సమయం 2003లో రోజుకు 68 నిమిషాలు ఉంటే, 2019 నాటికి అది 38 నిమిషాలకు (44 శాతం) పడిపోయింది. అదే సమయంలో కంప్యూటర్లు, స్క్రీన్ల ముందు గడిపే సమయం రోజుకు 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు (336 శాతం) పెరిగింది. బర్త్ రేట్లు తగ్గడానికి ఐఫోన్/స్మార్ట్‌ఫోన్ ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ… ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధాలు క్షీణించడం, జీవనశైలి మార్పులు బర్త్ రేట్‌పై ఎక్కువగా ప్రభావం చూపినట్టు పరిశోధనలు స్పష్టం చేశాయి.

ప్రపంచవ్యాప్తంగానూ ఇదే సమస్య..

ఐఫోన్/స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఒక్క అమెరికాలోనే బర్త్ రేట్ తగ్గలేదని, ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లోనూ దాని ప్రభావం ఉన్నదని రీసెర్చర్లు అంచనా వేశారు. ‘యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి’కి చెందిన ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంక్ డేటాను ఉపయోగించి 128 దేశాల్లో స్మార్ట్‌ఫోన్ వ్యాప్తిని, బర్త్ రేట్లను పరిశీలించారు. మతపరమైన సంప్రదాయాలు, మెరుగైన ఆరోగ్య పద్ధతులు, చట్టాలు ఉన్న దేశాల్లో కూడా 2007 తర్వాత బర్త్ రేట్లు పడిపోవడం గుర్తించారు. దీన్ని పరిశోధకులు ‘కామన్ గ్లోబల్ టెక్నాలజీ షాక్’ అని పేర్కొన్నారు. ఇరాన్, కోస్టారికా, చిలీ, మెక్సికో, టర్కీ లాంటి దేశాల్లో సైతం స్మార్ట్‌ఫోన్లు ప్రజల్లోకి వెళ్లాక టీనేజ్ ఫెర్టిలిటీ రేట్ తగ్గింది.

నివేదికల ప్రకారం.. కేవలం ధనిక దేశాల్లోనే కాదు.. పేద, మధ్య ఆదాయ దేశాల్లోనూ జనాభా తగ్గుతున్నది. కెనడాలో 2024లో ఫెర్టిలిటీ రేట్ 1.25గా నమోదైంది. ఇది జపాన్, సింగపూర్, స్పెయిన్ (1.30) కంటే తక్కువ. జనాభా తగ్గడంతో చైనా 2016లోనే ‘వన్ చైల్డ్ పాలసీ’ రద్దు చేసింది. అయినప్పటికీ అక్కడ మెరుగైన ఫలితాలు రావడం లేదు. జపాన్, దక్షిణ కొరియా కూడా జనాభా వృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదు. భారత్, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా బర్త్ రేట్ వేగంగా పడిపోతున్నది.

Read Also: యథేచ్ఛగా అక్రమ వ్యాపారం.. జోరుగా ‘జీరో’ దందా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>