కలం, కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) కు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు అత్యంత కీలక కమిటీలలో సభ్యునిగా అడ్లూరిని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీలో మంత్రి అడ్లూరిని సభ్యునిగా చేర్చారు. ఎస్సీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగిన మంత్రిగా అడ్లూరి అనుభవం కమిటీ నిర్ణయాలకు మరింత బలం చేకూర్చనుంది.
అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో కుల, సామాజిక గుర్తింపు ఆధారంగా వివక్షను నిరోధించే లక్ష్యంతో రూపొందిస్తున్న రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నిరోధక) బిల్లు–2026 కు సంబంధించిన శాసన రూపకల్పనపై అధ్యయనం చేసి సూచనలు చేయనున్న కేబినెట్ సబ్ కమిటీలో ప్రభుత్వం అడ్లూరికి సభ్యత్వం కల్పించింది.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పరిపాలనకు కేంద్ర బిందువుగా నిలిపిందని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పన, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగబద్ధమైన, న్యాయసమ్మతమైన సిఫారసులు అందించేందుకు కమిటీ కృషి చేస్తుందన్నారు.
అలాగే, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎలాంటి వివక్షకు గురికాకుండా చట్టపరమైన రక్షణ కల్పించే విధంగా రోహిత్ వేముల బిల్లును ఆదర్శవంతమైన చట్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అడ్లూరి తెలిపారు. ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆ దిశలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతుందని చెప్పారు.

